మహారాష్ట్రలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు.. ఫడ్నవీస్‌కు కీలక శాఖలు

0
104

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడిన 40 రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ, మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రక్రియ మంగళవారం పూర్తయిన విషయం తెలిసిందే. తమకు కీలక శాఖల బాద్యతలు అప్పగిస్తారా లేక అంతగా ప్రాధాన్యత లేని శాఖలు లభిస్తాయా అనే దానిపై మంత్రుల్లో నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడింది. మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నిర్ణయం తీసుకున్నారు. ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు కేబినెట్‌లో పెద్ద శాఖలను కేటాయించారు. ఫడ్నవీస్‌కు హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలను కేటాయిస్తూ షిండే నిర్ణయం తీసుకున్నారు. 18 మంది మంత్రులను చేర్చుకోవడం ద్వారా మంగళవారం తన ఇద్దరు సభ్యుల మంత్రివర్గాన్ని విస్తరించిన షిండే, పట్టణాభివృద్ధి శాఖను తన వద్దే ఉంచుకున్నారు.

ఫడ్నవీస్ ఆర్థిక, హోం శాఖను కూడా నిర్వహిస్తారని, బీజేపీ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ కొత్త రెవెన్యూ మంత్రిగా ఉంటారని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఒక ప్రకటన పేర్కొంది. భాజపా మంత్రి సుధీర్ ముంగంటివార్‌ను అటవీ శాఖ మంత్రిగా నియమించారు. ఆయన గతంలో కూడా ఈ శాఖను నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆయన పార్లమెంటరీ వ్యవహారాలను కూడా చూస్తారు. షిండే నేతృత్వంలోని శివసేన తిరుగుబాటుదారుల బృందం నుండి పాఠశాల విద్యకు కొత్త మంత్రిగా దీపక్ కేసర్కర్ కాగా.. అబ్దుల్ సత్తార్‌కు వ్యవసాయ శాఖను కేటాయించారు. బీజేపీ-శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన 40 రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగిన సంగతి తెలిసిందే.

రవీంద్ర చవాన్‌కు పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మినహా), ఆహారం, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల రక్షణ మంత్రిత్వ శాఖను కేటాయించారు. బీజేపీ నాయకులకు కేటాయించబడిన ఇతర ప్రధాన శాఖలలో గిరీష్ మహాజన్‌కు గ్రామాభివృద్ధి, పంచాయితీ రాజ్, వైద్య విద్య, క్రీడలు, యువజన సంక్షేమం శాఖలను ఇచ్చారు. సురేష్ ఖాడేకు కార్మిక శాఖ , మంగళ్ ప్రభాత్ లోధాకు టూరిజం, స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మహిళలు- శిశు అభివృద్ధి మంత్రిత్వి శాఖలను కేటాయించారు. గిరిజనుల అభివృద్ధిని విజయ్‌కుమార్‌ గవిట్‌కు, సహకార, ఇతర వెనుకబడిన, బహుజన సంక్షేమ శాఖ అతుల్‌ సేవ్‌కు కేటాయించారు.

ఓడరేవులు, మైనింగ్ శాఖను దాదా భూసేకు కేటాయించగా, శంభురాజే దేశాయ్‌కు రాష్ట్ర ఎక్సైజ్ శాఖను కేటాయించారు. సందీపన్ బుమ్రేకు ఉపాధి హామీ పథకం, ఉద్యానవన శాఖను కేటాయించారు. ఉదయ్ సమంత్‌కు పరిశ్రమల పోర్ట్‌ఫోలియో ఇవ్వడంతో, తానాజీ సావంత్‌కు పబ్లిక్ హెల్త్ అండ్ వెల్ఫేర్ శాఖ కేటాయించబడింది.గులాబ్రావ్ పాటిల్‌కు నీటి సరఫరా, పారిశుద్ధం, సంజయ్ రాథోడ్‌కు ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్‌ను కేటాయించారు. ఈ పోర్ట్‌ఫోలియోలన్నీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆమోదం తర్వాత ప్రకటించబడ్డాయి. శివసేన నుంచి దాదా భూసే, శంభురాజే దేశాయ్, సందీపన్ బుమ్రే, ఉదయ్ సమంత్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్, దీపక్ కేసర్కర్, గులాబ్రావ్ పాటిల్, సంజయ్ రాథోడ్‌లకు పోర్ట్‌ఫోలియోలను కేటాయించారు.

ఇదిలాఉండగా రాష్ట్ర కేబినెట్‌లో గరిష్టంగా 43 మంది ఎమ్మెల్యేలను తీసుకునే అవకాశమున్నప్పటికీ మొదటి దశలో ఇరు వర్గాల నుంచి 18 మందిని చేర్చుకున్నారు. మహిళలకు 50% రిజర్వేషన్‌ అమలులో ఉన్నప్పటికీ 1957–2019 మధ్య కాలంలో కేవలం 40 మంది మహిళలకు మంత్రి మండలిలో స్థానం లభించింది. అందులో 18 మంది మహిళలకు కేబినెట్‌లో, 22మంది మహిళలకు సహాయ మంత్రులుగా పదవులు లభించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here