పోర్చుగల్ లో విషాద సంఘటన చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో భారతీయ గర్భిణీ మరణించింది. సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో ఆమె మరణించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. గర్భిణి మరణంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో పోర్చుగల్ ఆరోగ్య శాఖ మంత్రి మార్టా టెమిడో మంగళవారం రాజీనామా చేశారు. అత్యవసర ప్రసూతి సేవలను తాత్కాలికంగా మూసివేవాలన్న ఆమె నిర్ణయం.. ఆస్పత్రుల మధ్య సమయం వల్ల భారతీయ గర్భిణీ చనిపోయిందని ఆమెపై విమర్శలు వచ్చాయి.
మార్టా టెమిడో రాజీనామాను ప్రధాన మంత్రి ఆమోదించినట్లు పోర్చుగల్ నేషనల్ పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ ఆర్టీపీ న్యూస్ వెల్లడించింది. గర్బిణి చనిపోయిన వార్త తెలిసిన 5 గంటల్లోనే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే భారత్ కు చెందిన 36 ఏళ్ల యువతి పోర్చుగల్ లో నివసిస్తున్నారు. ఆమె ప్రసవం కోసం రాజధాని లిస్బన్ లో ఉన్న శాంతా మారియా ఆస్పత్రికి వెళ్లారు. అయితే అక్కడ ప్రసూతి వార్డ్ ఖాళీ లేకపోవడంతో.. మరో ఆస్పత్రి సావో ఫ్రాన్సిస్కో జేవియర్ కు తరలించారు. ఇలా తరలిస్తున్న క్రమంలోనే ఆస్పత్రికి చేరేలోపే గుండె పోటుకు గురై గర్భిణి మరణించింది.
అయితే వెంటనే సిజేరియన్ చేసిన వైద్యులు బిడ్డను రక్షించారు. ప్రస్తుతం శిశును ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో ఆరోగ్య శాఖ మంత్రి మార్టా టెమిడో రాజీనామా చేశారు. అయితే కొత్త మంత్రిని ఎన్నుకునే వరకు ఆమె పదవిలో కొనసాగనుంది. కోవిడ్ సమయంలో టెమిడో విశేష సేవలను అందించారని.. తాజాగా ఘటనతో రాజీనామా చేయాల్సి వచ్చిందని ప్రధాని ఆంటోనియో కోస్టా అన్నారు. పోర్చుగల్ లో ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువ అయ్యాయి. గైనకాలజిస్టులతో పాటు వైద్యసిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో ఇతర దేశాల నుంచి వైద్య సిబ్బందిని నియమించుకుంటోంది ఆ దేశం.