జార్ఖండ్ హజారీ బాగ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రుణ వాయిదా చెల్లించలేదని ట్రాక్టర్ తీసుకువెళ్లేందుకు లోక్ రికవరీ ఏజెంట్లు వచ్చిన క్రమంలో గర్భిణిపై ట్రాక్టర్ ఎక్కించారు. దీంతో మూడు నెలల గర్భిణి మరణించింది. జిల్లాలోని ఇచక్ ప్రాంతానికి చెందిన మిథిలేష్ రైతు స్థానికంగా ఉన్న ఫైనాన్స్ కంపెనీలో రుణం తీసుకుని ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అయితే నెలనెల కట్టాల్సిన వాయిదాలను కొన్ని కారణాల వల్ల చెల్లించలేదు.
ఈ క్రమంలో ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులు ట్రాక్టర్ ను జప్తు చేసేందుకు వచ్చారు. ఈ సమయంలో రైతు మిథిలేష్, ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో మిథిలేష్ ట్రాక్టర్ స్థానికంగా ఉన్న పెట్రోల్ బంకులో ఉంది. దీంతో ట్రాక్టర్ ని జప్తు చేసేందుకు లోక్ రికవరీ ఏజెంట్లు ట్రాక్టర్ ఉన్న చోటుకు బయలుదేరారు. ఆ సమయంలో లోన్ రికవరీ ఏజెంట్ ట్రాక్టర్ తీసుకెళ్లకూడదంటే రూ. 1,30,000 తీసుకురమ్మని కోరాడు. డబ్బుతో మిథిలేష్ వచ్చాడు. అయితే డబ్బు ఇస్తున్న క్రమంలో కారులో కూర్చున్న లోన్ రికవరీ ఏజెంట్ ను ఐడీ కార్డు చూపించాలని కోరాడు. దీంతో నేనో.. ఫైనాన్స్ కంపెనీ జనరల్ మేనేజర్ అని .. నన్నే ఐడీ కార్డు చూపించమని అడుగుతావా..? అంటూ మిథిలేష్ తో వాగ్వాదానికి దిగాడు.
కాగా.. కోపంతో ఉన్న రికవరీ ఏజెంట్ ట్రాక్టర్ స్పీడ్ గా తీసుకెళ్లాలని మరో వ్యక్తికి చెప్పాడు. ఈ క్రమంలో రైతు మిథిలేష్ కూతురు మోనిక ట్రాక్టర్ ఆపే ప్రయత్నం చేసింది. అయినా డ్రైవర్ వేగంగా ఆమె పై నుంచి ట్రాక్టర్ని పోనిచ్చాడు. వెంటనే మిథిలేష్ కుమార్తెను స్థానిక ఆస్పత్రికి తరలించినా.. లాభం లేకుండా పోయింది. ఆమె చికిత్స పొందుతూ మరణించింది. మోనిక మూడు నెలల గర్భంతో ఉంది. కేసు నమోదు చేసుకున్న హజారీబాగ్ పోలీసులు విచారణ చేపట్టారు. బాధ్యలపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ మనోజ్ రతన్ చౌత్ తెలిపారు.