ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ఆదాయపు పన్నుల శాఖ(ఐటీ) నోటీసులు జారీ చేసింది. అయితే దీన్ని ఆయన ప్రేమలేఖగా అభివర్ణిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనకు ఐటీ నోటీసు వచ్చిందని అది ప్రేమలేఖ అని ఆయన గురువారం ట్వీట్ చేశారు. 2004, 2009, 2014, 2020 సంవత్సరాల్లో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌కు సంబంధించి తాజాగా ఐటీ నోటీసులు జారీ చేసింది.
మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏక్‌నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే శరద్ పవార్ కు ఐటీ శాఖ నుంచి నోటీసులు అందాయి. ఐటీ నోటీసులపై శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ ఏజెన్సీలు కొంతమంది నేతల సమాచారాన్ని సేకరిస్తున్నాయని అన్నారు. ఈ నోటీసులపై స్పందిస్తూ పవార్ మరాఠీలో ట్వీట్ చేశారు. ఈడీ, ఐటీ నుంచి చాలా మంది శాసన సభ్యులు తమకు నోటీసులు అందాయని చెప్పారని.. ఐదేళ్ల క్రితం వరకు ఈడీ పేరు పెద్దగా ఎవరికి తెలియదని.. ఈ రోజు గ్రామాల్లో కూడీ మీ వెనక ఈడీ ఉంటుందని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారంటూ ట్వీట్ చేశారు.
ఇప్పటికే మహా వికాస్ అఘాడీ సర్కార్ లోని మంత్రి నవాబ్ మాలిక్ మనీలాండరింగ్ వ్యవహారంలో, దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణపై ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. తాజాగా శివసేన కీలక నేత సంజయ్ రౌత్, పత్రచల్ భూముల కుంభకోణం కేసులో ఈ రోజు ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఇప్పుడు తాజాగా శరద్ పవార్ కు ఐటీ నోటీసులు పంపింది