ఒక సీనియర్ న్యాయవాదికి గువాహటి హైకోర్టు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. జీన్స్ వేసిన పాపానికి.. ఆయన్ను కోర్టు ప్రాంగణం నుంచి బయటకు పంపించేసింది. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. కేవలం జీన్స్ ధరించి, ఓ కేసు విచారణకు వచ్చినందుకు గాను.. పోలీసుల్ని పిలిపించి మరీ, ఆయన్ను బయటకు పంపింది. ఈ దెబ్బకు షాక్ తిన్న ఆ న్యాయవాది.. ఏం చేయలేక కోర్టు నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
అస్సాంలోని గువాహటి హైకోర్టు ముందు ఓ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ క్రమంలోనే పిటిషనర్ తరఫు న్యాయవాది బీకే మహాజన్.. జీన్స్ ధరించి కోర్టుకు హాజరయ్యారు. తన వాదనలు వినిపించేందుకు ముందుకొచ్చారు. అప్పుడు ఆయన జీన్స్ ధరించడాన్ని గమనించిన జస్టిస్ కల్యాణ్ రాయ్ సురానా ఆధ్వర్యంలోని ధర్మాసనం.. వెంటనే పోలీసుల్ని పిలిపించింది. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలీక అందరూ అయోమయానికి గురయ్యారు. పోలీసులు రాగానే.. ఆ న్యాయవాదిని వెంటనే బయటకు పంపించేయాలని ఆదేశించింది. అంత పెద్ద తప్పు తానేం చేశానా? అని ఆ న్యాయవాది అనుకునేలోపు.. తాను జీన్స్ ధరించిన విషయం గ్రహించాడు. ఇంకేముంది.. ఏం చెప్పలేక కోర్టు ఆదేశాల మేరకు బయటకు వచ్చేశారు.
‘‘బీకే మహాజన్ జీన్స్ ప్యాంట్ ధరించి కోర్టులోకి వచ్చారు. అందువల్ల ఆయన్ను హైకోర్టు ప్రాంగణం నుంచి బయటకు బయటకు పంపించేందుకు పోలీసు సిబ్బందిని పిలవాల్సి వచ్చింది. దీంతో.. నేటి విచారణ వాయిదా పడింది’’ అని జస్టిస్ సురానా తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి, రిజిస్ట్రార్ జనరల్‌తో పాటు అస్సాం, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్‌లోని బార్ కౌన్సిళ్ల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. చూస్తుంటే.. ఈ జీన్స్ వ్యవహారం ఆ న్యాయవాదికి పెద్ద చిక్కులే తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.