సంజయ్ రౌత్‌కు ఈడీ మళ్లీ సమన్లు

0
177

మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ కేసులో మంగళవారం తమ ఎదుట హాజరు కావాలంటూ సోమవారం ఈడీ అధికారులు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఈడీ విచారణకు హాజరుకాలేనని ఆయన అన్నారు. తనకు అలీబాగ్‌లో సమావేశం ఉన్నందున మరింత సమయం ఇవ్వాలని సంజయ్ రౌత్ ఈడీని కోరారు. దీంతో జులై 1న విచారణకు హాజరు కావాలని ఈడీ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది.

పత్రచల్ భూముల వ్యవహారంలో కుంభకోణానికి పాల్పడినట్లు సంజయ్ రౌత్ పై ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్రలో ఓ పక్క అధికార శివసేన శాసనసభ్యులు తిరుగుబాటు చేయడం, మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో ఆయనకు ఈడీ సమన్లు జారీ చేయడం గమనార్హం. సంజయ్ రౌత్ తరఫు న్యాయవాదులు మంగళవారం ముంబయిలో ఈడీ అధికారులను కలిశారు. ఆయన హాజరయ్యేందుకు 2 వారాల గడువు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈడీ మాత్రం ఈ నెలాఖరు వరకు సమయం ఇచ్చింది. జులై 1న తమ ఎదుట హాజరు కావాలని తాజాగా మరోసారి సమన్లు ఇచ్చింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సంజయ్ రౌత్ విచారణకు హాజరు కావడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమయం మంజూరు చేసినట్లు శివసేన ఎంపీ తరపు న్యాయవాది మంగళవారం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here