మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార తలకెక్కి, గర్వంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఘాటుగా వ్యాఖ్యానించింది. తనపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలని నుపుర్ శర్మ సుప్రీంకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసింది. ఆమె తరుపున మణిందర్ సింగ్ వాదనలు వినిపించారు. ఈ సమయంలో జస్టిస్ సూర్యకాంత్, జేబీ పార్థవాలాతో కూడిన ధర్మాసనం నుపుర్ శర్మ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
తను చేసిన వ్యాఖ్యలపై నుపుర్ శర్మ మీడియా ముఖంగా దేశానికి క్షమాపణలు చెప్పాలని, సదరు టీవీ యాజమాన్యం కూడా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా భావోద్వేగాలు రగిలించిన తీరుపై ఆమె ఒంటరిగా బాధ్యత వహించాలని పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఆమె లాయర్ అని చెప్పుకోవడం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆమె ఫిర్యాదు చేసిన వ్యక్తి అరెస్ట్ అయినా.. ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు నుపుర్ శర్మపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేసింది.
ఓ పార్టీకి అధికార ప్రతినిధి అయిన నుపుర్ శర్మకు గర్వం, అధికారం తలకెక్కాయని వ్యాఖ్యానించింది. చీప్ పబ్లిసిటీ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని ఘాటుగా విమర్శించింది. నీ వల్లే ఉదయ్ పూర్ ఘటన జరిగిందంటూ సుప్రీం కోర్ట్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. టీవీ చర్చ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం ఇచ్చారని నుపుర్ శర్మ లాయర్ కోర్టుకు తెలిపారు. దీనికి ప్రతిగా ‘‘ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉంటుంది.. ప్రజాస్వామ్యంలో గడ్డి పెరిగే హక్కు ఉంది, గాడిదకు తినే హక్కు ఉంది’’ అని న్యాయమూర్తి ఘాటుగా బదులిచ్చారు. నుపుర్ శర్మపై దాఖలైన అన్ని కేసులను ఢిల్లీకి బదిలీ చేసేందుకు సుప్రీం కోర్ట్ నిరాకరించింది.