జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

0
114

కేరళకు చెందిన జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2020 నుంచి జైలులోనే ఉన్నాడు సిద్ధిఖీ కప్పన్. ఇంతకు ముందు అలహాబాద్ హైకోర్టులో బెయిల్ కోసం అప్లై చేయగా.. కోర్టు తిరస్కరించింది. ఆ తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు సిద్ధిఖీ కప్పన్. తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఇచ్చే సమయంలో ప్రతీ వ్యక్తికి భావప్రకటన స్వేచ్చ ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అతనిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది.

భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ తో కూడిన ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జర్నలిస్టు సిద్ధిఖీ కప్పన్ ఆరువారాల పాటు ఢిల్లీలో, ఆ తరువాత కేరళ పోలీసులకు రిపోర్టు చేస్తారని తీర్పు చెప్పింది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ సామూహిక అత్యాచార కేసును రిపోర్టు చేసేందుకు వెళ్తున్న క్రమంలో సిద్ధిఖీ కప్పన్ ను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై యూఏపీఏ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. మలయాళ వార్తా పోర్టర్ అజీముఖం రిపోర్టర్ సిద్ధికీ కప్పన్‌కు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తో సంబంధాలు ఉన్నాయని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. అయితే దీనితో సుప్రీంకోర్టు ఏకీభవిచలేదు. తాను నిర్దోషినని.. అక్రమంగా ఇరికించబడ్డానని సుప్రీంకోర్టులో వాదించారు కప్పన్.

అల్లర్లను ప్రేరేపించడానికి సిద్ధిఖీ కప్పన్‌కు పీఎఫ్ఐ డబ్బు చెల్లించిందని.. అతను గుర్తింపు పొందిన జర్నలిస్టు కాదని.. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. కప్పన్ అల్లర్లను సృష్టించడానికి, పేలుడు పదార్థాలను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం వాదించింది. కప్పన్ పీఎఫ్ఐకి చెందిన వాడని.. అది ఉగ్రవాద సంస్థ అని యూపీ ప్రభుత్వం తరుపున న్యాయవాది మహేష్ జెఠ్మలానీ వాదించారు. కాగా.. కప్పన్ కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కప్పన్ వద్ద ఏం దొరికాయి.. అతని వద్ద పేలుడు పదార్థాలు కానీ, ఇతర మెటీరియల్ కనుగొనబడలేదని, ఏ రకమైన ప్రచారానికి ఉపయోగించలేదని సీజేఐ జస్టిస్ లలిత్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here