ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ పూర్తియింది. దీనిపై తీర్పును రిజర్వ్ చేసింది రాజ్యాంగ ధర్మాసనం. ఆర్థికంగా వెనకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ.. 103వ రాజ్యాంగ సవరణ తీసుకువచ్చింది కేంద్రం. దీన్ని సవాల్ చేస్తూ.. 40 వరకు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.
మంగళవారం ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులు దినేశ్ మహేశ్వరి, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ త్రివేది, జస్టిస్ పార్దీవాలాల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఈ కేసుపై పలువురు సీనియర్ న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. కేంద్రం తరుపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతాలు వాదనలు వినిపించారు. ఈడబ్ల్యూఎస్ కోటా రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘిస్తుందా..? అనేదానిపై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసుపై ఆరున్నర గంటల పాటు విచారణ సాగింది. రిజర్వేషన్ వ్యవస్థను నాశనం చేసేందుకు కేంద్రం ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ఈడబ్ల్యూ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా వాదనలు సాగాయి.
కేంద్రం తరుపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్, సోలిసిటర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించారు. ఇది 50 శాతం సామాజికంగా వెనకబడి ఉన్న తరగతుల రిజర్వేషన్లకు భంగం కలిగించదని వాదించారు. ఈ విషయంలో ఇందిరా సాహ్ని కేసును సుప్రీంకోర్టు పరిశీలించాలని రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న న్యాయవాదులు సుప్రీం ధర్మాసనాన్ని కోరారు.
ఉన్నత వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం 2019, ఫిబ్రవరి 1న అమలులోకి వచ్చింది. ఫలితంగా వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణ పేదలకు లబ్ధి చేకూరనుంది. 103 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రిజర్వేషన్లను కేంద్రం తీసుకువచ్చింది. దీని వల్ల ఇతర సామాజిక వర్గాల్లో వెనకబడి ఉన్న పేదవారికి ‘‘సామాజిక సమానత్వం’’ అందించేందుకు తీసుకువచ్చినట్లు కేంద్రం తెలిపింది.