ఇటీవల బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు వచ్చిన బెదిరింపు లేఖ నుంచి బాలీవుడ్ ఇంకా కోలుకోక ముందే.. నటి స్వర భాస్కర్‌కు వార్నింగ్ లెటర్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్రలోని వెర్సోవాలో ఉంటోన్న ఈ నటి నివాసానికి స్పీడ్ పోస్ట్ ద్వారా ఓ లేఖ వచ్చింది. వీర్ సావర్కర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే, దేశ యువత ఏమాత్రం సహించదని ఆ లేఖలో పేర్కొని ఉంది. దీంతో షాక్‌కి గురైన ఆమె.. వెంటనే పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.
కాగా.. సోషల్ మీడియాలో పలు అంశాలపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో ఉండే స్వర భాస్కర్, 2017లో వీర్ సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. తనను జైలు నుంచి విడిపించాలని వీర్ సావర్కర్ బ్రిటీష్ ప్రభుత్వాన్ని వేడుకున్నాడని, అది వీరత్వం ఎలా అవుతుందని ఆమె ట్వీట్ చేసింది. అప్పట్లో ఇది పెద్ద దుమారమే రేపింది. ఆ అంశం మీదే స్వర భాస్కర్‌కు ఇప్పుడు బెదిరింపు లేఖ వచ్చింది.