ఉగ్రవాదమే కాంగ్రెస్ ఓటు బ్యాంకు.. ప్రధాని విమర్శలు

0
81

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆదివారం గుజరాత్ లోని ఖేడా ప్రాంతంలో బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదాన్ని తారాస్థాయికి తీసుకెళ్లిందని.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే ఉగ్రవాదులు దేశాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదాన్ని లక్ష్యంగా చేసుకుని పోరాడాలని కోరామని..కానీ వారు మాత్రం నన్ను లక్ష్యంగా చేసుకున్నారంటూ వ్యాఖ్యానించారు.

గుజరాత్ రాష్ట్రం చాలా కాలంగా ఉగ్రవాదులకు లక్ష్యంగా ఉందని.. సూరత్, అహ్మదాబాద్ లలో జరిగిన పేలుళ్లలో చాలా మంది గుజరాత్ ప్రజలు చనిపోయారని.. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.. మేము ఉగ్రవాదాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలని అడిగితే..వారు మాత్రం నన్ను లక్ష్యంగా చేసుకున్నారని ప్రధాని కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో దేశంలో ఉగ్రవాదం తారాస్థాయికి చేరుకుందని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా పరిగణిస్తోందని.. బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడే అనేక ఇతర పార్టీలు కూడా పుట్టుకొస్తున్నాయని అన్నారు.

బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ సమయంలో కాంగ్రెస్ నేతలు ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచారని.. బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని నిర్మూలించే దిశగా పనిచేస్తుందని ప్రధాని అన్నారు. 2014లో మీ ఒక్క ఓటు దేశంలో ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో సహకరించిందని.. మా సరిహద్దులపై దాడి చేసే ముందు ఉగ్రవాదులు చాలా ఆలోచించాలని ఆయన అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ సర్జికల్ స్ట్రైక్స్ ని ప్రశ్నిస్తుందని అన్నారు. రాష్ట్రంలో 25 ఏళ్ల వయసు ఉన్న యువత కర్ఫ్యూ ఎలా ఉంటుందో ఎప్పుడూ చూడలేదని.. బాంబు పేలుళ్ల నుంచి వారిని మేము రక్షించామని.. బీజేపీ డబుల్ ఇంజిన్ మాత్రమే ఇది చేయగలుగుతుందని ఆయన అన్నారు.

గుజరాత్ ఎన్నికలు డిసెంబర్ 1,5 తేదీల్లో రెండు విడతల్లో జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు ప్రకటించబడుతాయి. 2017 గుజరాత్ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాల్లో బీజేపీ 99 స్థానాలను గెలుచుకుంది. గత 27 ఏళ్లుగా బీజేపీ గుజరాత్ లో అధికారంలో ఉంది. ఈ సారి 140 స్థానాలు దాటాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. 2001 నుంచి 2014 వరకు వరసగా నరేంద్రమోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here