జమ్మూ కాశ్మీర్ లో రాజౌరీ ఉగ్రవాద ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హిందువులే టార్గెట్ గా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం నలుగురు వ్యక్తులు మరణించారు. మరోవైపు ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భద్రతాబలగాలు భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఆదివారం సాయంత్రం 7 గంటలకు రాజౌరీలోని హిందువుల ఇళ్లకు చొరబడి కాల్పులు ప్రారంభించారు ముష్కరులు. ముందుగా వారి ఐడెంటిటీని గుర్తించేందుకు వారి ఆధార్ కార్డును ఉపయోగించారని భద్రతా వర్గాలు తెలుపుతున్నాయి.
జమ్మూ ప్రాంతంలో ఇటాంటి ఘటన జరగడం చాలా అరుదు. చాలా ఏళ్ల తరువాత ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. నూతన సంవత్సరం మొదటి రోజు ఈ ఉగ్రఘాతుకం జరగడం జమ్మూ కాశ్మీర్ లో భయాందోళన రేకెత్తించింది. నలుగురు కేవలం 10 నిమిషాల్లోనే కాల్పులు ముగించి పారిపోయారని ఓ అధికారి తెలిపారు. మొదట వారు అప్పర్ డాంగ్రి ప్రాంతంలో ఓ ఇంటిపై దాడి చేసి.. ఆ తరువాత మరో ఇంటిలోకి దూరి కాల్పులు జరిపారు. అక్కడి నుంచి ఇలా నాలుగు ఇళ్లపై దాడులు చేశారు. ఈ దాడిలో 10 మందికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరణించిన వ్యక్తులను సతీష్ కుమార్ (45), దీపక్ కుమార్ (23), ప్రీతమ్ లాల్ (57), శిశుపాల్ (32)గా గుర్తించారు. పవన్ కుమార్ (38), రోహిత్ పండిట్ (27), సరోజ్ బాలా (35), రిధమ్ శర్మ (17), పవన్ కుమార్ (32) గాయపడ్డారు.
రాజౌరీ పట్టణానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో అప్పర్ డాంగ్రీ గ్రామంలో ముష్కరులను పట్టుకునేందుకు ఆర్మీ, సీఆర్ఫీఎఫ్, పోలీసులు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని జమ్మూ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ముఖేష్ సింగ్ తెలిపారు. ఈ దాడికి నిరసనగా పెద్ద ఎత్తున స్థానికులు నిరసన కార్యకర్తమాలు చేస్తున్నారు. వ్యాపార సంఘాలతో కలిసి ప్రజలు నిరసన తెలుపుతున్నారు. పాకిస్తాన్, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదులను సమర్థంగా ఎదుర్కోవడం లేదని ఆరోపిస్తూ.. లెఫ్టినెంట్ గవర్నర్, భద్రతా సంస్థలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జమ్మూ కాశ్మీర్ బిజెపి అధ్యక్షుడు రవీందర్ రైనా ఈ సంఘటనను ఖండించారు. ఇది పాకిస్తానీ ఉగ్రవాదుల “పూర్తి పిరికిపంద చర్య” అని అభివర్ణించారు. ఉగ్రవాదులను, ఉగ్రవాద మద్దతుదారులను తుడిచిపెడతామని ప్రతిజ్ఞ చేశారు.