దూసుకుపోతున్న ఓటీటీ బిజినెస్.. 2023 నాటికి రూ.12,000 కోట్ల వ్యాపారం

0
114

ఇండియాలో ఓవర్ – ది- టాప్(ఓటీటీ) వ్యాపారం విస్తరిస్తోంది. ఎస్బీఐ రిసెర్చ్ ప్రకారం 2023 నాటికి ఓటీటీ మార్కెట్ రూ. 11,944 కోట్లకు చేరుతుందని అంచానా వేసింది. 2018లో రూ.2590 కోట్లుగా ఉన్న ఓటీటీ వ్యాపారం ఐదేళ్లలో అనూహ్యంగా పుంజుకుంది. 36 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ సమయాల్లో ప్రజలు ఎక్కువగా ఓటీటీలకు చేరువయ్యారు. 2000 ప్రారంభంలో మల్లీప్లెక్సులు వీసీఆర్/ వీసీడీ బిజినెస్ ను ఎలా దెబ్బతీశాయో.. ప్రస్తుతం ఓటీటీలు, థియేటర్ వ్యాపారాన్ని అలా దెబ్బతీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఓటీటీ వినోద పరిశ్రమ వాటా, రాబడిలో 7-9 శాతాన్ని ఆక్రమించింది. ఓటీటీ అన్ని భాషల్లో కంటెంట్ అందిస్తుండటంతో ప్రేక్షకులు వీటికి దగ్గర అవుతున్నారు. అరచేతుల్లో వినోద పరిశ్రమ ఉండటంతో థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తక్కువ అవుతోంది. కంటెంట్ ఉన్న సినిమా వస్తే కానీ థియేటర్ల వైపు వెళ్లడం లేదు జనాలు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతిఘోష్ మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం 45 కోట్ల మంది ఓటీటీ సబ్‌స్క్రైబర్లు ఉన్నారని.. రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని.. 2023 నాటికి ఓటీటీ సబ్‌స్క్రైబర్లు సంఖ్య 50 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు.

అమెరికాతో పోలిస్తే తక్కవ ధరలు

ఓటీటీ ఎదుగుదలకు ఇంటర్నెట్ వేగం కూడా ఓ కారణం అవుతుంది. మొబైల్ ఇంటర్నెట్, ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రెట్టింపు కావడం కూడా ఓటీటీ వ్యాపారానికి కలిసి వస్తోంది. ప్రస్తుతం దేశంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో 4-జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇంటర్నెట్ వేగం పెరిగింది. రానున్న కాలంలో 5-జీ కూడా అందుబాటులోకి వస్తోంది.

ప్రస్తుతం డిస్నీ హాట్‌స్టార్ కి 14 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లు, అమెజాన్ ప్రైమ్ కి 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు, నెట్ ఫ్లిక్స్ కి 4 కోట్లు మంది, జీ 5కి 3.7 కోట్లు మంది, సోనీ లివ్ కి 2.5 కోట్లు మంది ఖాతాదారులు ఉన్నారు. తక్కువ ధరలకు సేవలన్ని అందిస్తుండటంతో వీటికి ఖాతాదారులు పెరుగుతున్నారు. యూఎస్ తో పోలిస్తే 70-90 శాతం కన్నా చౌకగా ప్లాన్‌లను అందిస్తున్నాయి. దీంతో సబ్‌స్క్రైబర్‌లు పెరుగుతున్నారు.

థియేటర్ వ్యాపారానికి భారీ దెబ్బ

50 శాతం కన్నా ఎక్కువ మంది ప్రజలు నెలకు 5 గంటల కన్నా ఎక్కువ సమయం ఓటీటీలను ఉపయోగిస్తున్నారని.. దీంతో థియేటర్ లాభాలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా ఓటీటీల కోసమే కంటెంట్ సిద్ధం చేస్తున్నారు. వెబ్ సిరీస్ లు, సినిమాలను ఓటీటీల్లోకి తేస్తుండటంతో ఇదే లాభసాటి మార్గమని చాలా మంది గ్రహించారు. సంప్రదాయక ఫిల్మ్ మేకింగ్ కన్నా ఓటీటీలే లాభదాయకం అని గ్రహించిన స్టూడియోలు ప్రత్యేకించి సొంత స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. రాబోయే కాలంలో విద్య, హెల్త్, ఫిట్ నెస్ వంటివి కూడా ఓటీటీల్లో విస్తరించే అవకాశం ఉంది. దీంతో మరింగా జనాల్లోకి ఓటీటీలు ప్రవేశించే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here