అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్లుంది రైతుల పరిస్థితి.. ఎండకి ఎండి వానకి తడిసి రాత్రిబవళ్ళు కంటికి కునుకులేకుండా కష్టపడే రతుకి ఎప్పుడు కన్నీళ్లే.. అందుకే నమ్ముకోవాల్సిన భూమిని అమ్ముకుని ఎందరో రైతులు బ్రతుకు జీవుడా అంటూ పల్లెనొదిలి పట్టణాలకు వలసపోతున్నారు.. కానీ కొందరు రైతులు మాత్రం హలాన్నే నమ్ముకున్నారు.. ఆశతో ఆరుగాలం కష్టపడుతున్నారు.. కానీ వాళ్ళ కష్టం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.. ఆకలి తీర్చే అన్నదాతల ఆవేదన ఎవరికీ పట్టనట్టుంది పరిస్థితి.. ఎప్పుడు మారుతుందో రైతన్నల దుస్థితి అనిపిస్తుంది టమోటా రైతులని చూస్తుంటే..
నిన్న మొన్నటి వరకు టమోటా ధర ఆకాశాన్ని తాకింది.. కానీ ఒక్కసారిగా టమోటా ధర అమాంతం పడిపోయింది.. ఈ మధ్య 200 నుండి 250 వరకు పలికింది టమోటా ధర..కాగా తాజాగా పత్తికొండ నియోజకవర్గానికి చెందిన టమోటా రైతులు వాళ్ళు పండించిన పంటకి మంచి ధర పలుకుతుందనే ఆశతో మార్కెట్ యార్డ్ కి తీసుకెళ్లారు..
కానీ వాళ్ళ ఆశలు అడియాశలై చివరికి నిరాశే మిగిలింది.. మార్కెట్ యాడ్ లో రైతులు తీసుకొచ్చిన టమోటాలను అధికారులు వేలం వేయగా కింటా 1000 రూపాయలు పలికింది..అంటే కేజీ 10 రూపాయలు మాత్రమే పలకడం గమనార్హం..ఇక చేసేది ఏమి లేక టమోటాలను రోడ్ పైన పడేయలేక అదే ధరకి విక్రయించారు.. దీనితో టమోటా రైతులు ఇలా గిట్టుబాటు ధరలేకపోతే కన్నీసం ట్రాన్స్పోర్ట్ చార్జీలు కూడ రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కాగా బహిరంగ మార్కెట్ లో కేజీ టమోటా రూ/ 40 నుండి రూ/ 50 లకి విక్రయిస్తున్నారు..