అమర్ నాథ్ యాత్రలో విషాదం.. వరదల్లో 10 మంది మృతి..

0
193

జమ్మూ కాశ్మీర్ అమర్ నాథ్ యాత్ర విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షం కారణంగా వరదలు పోటెత్తాయి. అమర్ నాథ్ గుహకు సమీపం వరకు నీరు చేరింది. కొండలపై నుంచి వస్తున్న మెరుపు వరదలో భక్తులు కొట్టుకుపోయారు. దీంతో ఇప్పటి వరకు 10 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరికొంత మంది వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం. ఇప్పటికే ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రెస్క్యూ ఆపరేషన్ ను మొదలుపెట్టారు. ఆర్మీ హెలికాప్టర్లలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అయితే మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. 40 మంది వరకు గల్లంతు అయినట్లు తెలుస్తోంది. దాదాపుగా వరదల్లో 12 వేల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వీరందరిని రక్షించేందుకు భద్రతా సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది. యాత్రికులు లోయల్లో వేసుకున్న టెంట్లన్నీ వరద నీటికి కొట్టుకుపోయాయి. అమర్ నాథ్ కుంభవృష్టిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ లెప్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హాతో మాట్లాడానని.. సహాయక చర్యలు కొనసాగుతాయని ట్వీట్ చేశారు. హోంమంత్రి అమిత్ షా సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

గత నెల 30న అమర్ నాథ్ యాత్ర ప్రారంభం అయింది. దాదాపుగా 45 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. ఆగస్టు 11 వరకు ఈ యాత్ర జరగనుంది. ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉండటంతో భారత ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా అమర్ నాథ్ యాత్ర జరగలేదు. దీంతో ఈ ఏడాది పెద్ద సంఖ్యలో యాత్రికులు అమర్ నాథ్ యాత్రకు వచ్చారు. అయితే నిన్నటి నుంచి అమర్ నాథ్ పరిసరాల్లో భారీగా వర్షం పడుతుండటంతో పాటు కొండలపై నుంచి మెరుపు వరదలు పరిసరాలను ముంచెత్తాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, వాతావరణం రెస్క్యూ చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here