University Professor Forced To Quit Job For Bikini Pictures: వృత్తికి, వ్యక్తిగత జీవితానికి ఏమాత్రం సంబంధం ఉండదు. అసలు లింక్ పెట్టకూడదు కూడా! కానీ, ఓ యూనివర్సిటీ మాత్రం ఒక ప్రొఫెసర్ వ్యక్తిగత జీవితాన్ని సైతం సీరియస్‌గా తీసుకుంది. బికినీ ధరించిందన్న నెపంతో, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. నిజానికి.. ఆమె బికినీ వేసుకునే అంశం యూనివర్సీటీతో ఏమాత్రం లింక్ లేదు. అయినప్పటికీ.. ఉద్యోగంలో నుంచి తీసేసి, రూ. 99 కోట్ల జరిమానా కట్టాలన్న షరతు విధించింది. గతేడాదిలో చోటు చేసుకున్న ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
కోల్‌కతాలోని ప్రముఖ సెయింట్ జేవియర్స్ యూనివర్సిటీలో ఓ మహిళ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఈమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన బికినీ ఫోటోల్ని షేర్ చేసింది. వాటిని అదే యూనివర్సిటీలో చదువుతోన్న 18 ఏళ్ల స్టూడెంట్ చూశాడు. అది గమనించిన అతడి తండ్రి, వెంటనే యూనివర్సిటీకి ఆ ప్రొఫెసర్‌పై ఫిర్యాదు చేశాడు. ‘‘ప్రొఫెసర్‌కు సంబంధించిన కొన్ని బికినీ ఫోటోలను నా కుమారుడు చూడటాన్ని నేను గమనించాను. ఆ ఫోటోలను చూసి నేను నిర్ఘాంతపోయాను. ఒక ప్రొఫెసర్ ఇలా లోదుస్తులు ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం నిజంగా అవమానకరం. ఇలా ఫోటోలు షేర్ చేస్తూ.. ఆమె తన విద్యార్థులకు ఏం బోధిస్తోంది? ఇది అసభ్యకరమైన చర్య’’ అంటూ ఆ స్టూడెంట్ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
దీంతో.. ఆ యూనివర్సిటీ సదరు ప్రొఫెసర్‌పై సీరియస్ అయ్యింది. వెంటనే ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించింది. అంతేకాదు.. యూనివర్సిటీకి కోలుకోలేని నష్టం కలిగించినందుకు క్షమాపణ చెప్పాలని, రూ. 99 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని నోటీసులు పంపింది. అయితే.. తానేం తప్పు చేయలేదని, దీనిపై న్యాయ పోరాటం చేస్తానని ఆ ప్రొఫెసర్ చెప్తోంది. యూనివర్సిటీ ప్రాంగణంలో డ్రెస్ కోడ్‌కి సంబంధించి తానెలాంటి ఉల్లంఘనకు పాల్పడలేదంది. తన ఇన్‌స్టా ప్రొఫైల్ కూడా ప్రైవేట్ ఖాతాయేనని తెలిపింది. అనవసరంగా తనని ఉద్యోగంలో నుంచి తొలగించారని, తనకు పంపిన నోటీసులపై తాను హైకోర్టుని ఆశ్రయించానని ఆ ప్రొఫెసర్ పేర్కొంది.