హిందూ దేవతల చిత్రాలు గల పేపర్లలో చికెన్ విక్రయిస్తూ మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు యూపీ పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సంభాల్ పట్టణానికి చెందిన తాలిబ్ హుస్సేన్ తన దుకాణంలో మాంసాన్ని హిందూ దేవుళ్ల బొమ్మలు ఉన్న కాగితంపై అమ్ముతూ.. తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నాడని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు అతన్ని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లగా.. హుస్సేన్ పోలీసులపై కత్తితో దాడికి దిగాడు. ఈ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.తాలిబ్ హుస్సేన్‌పై ఐపీసీ సెక్షన్లు 153-ఏ, 295-ఎ కింద పోలీసులు అభియోగాలు మోపారు.
ఇటీవల చాలా చోట్ల మతపరమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మహమ్మద్ ప్రవక్త గురించి బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడం, రాజస్థాన్, మహారాష్ట్రలో హిందువుల హత్యలు, కాళికా మాత నోట్లో సిగరెట్‌తో పోస్టర్ ఇలా ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా యూపీలోని సంభాల్ లో ఓ ముస్లిం వ్యాపారి హిందూ దేవతల చిత్రాలున్న పేపర్లలో మాంసాన్ని విక్రయిస్తున్న తీరు వెలుగులోకి వచ్చింది.