ఉజ్బెకిస్తన్ లో జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సమావేశం ప్రపంచ దృష్టిని ఆకర్షింది. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ యుద్దంపై భారత ప్రధాని మోదీ ఏ విధంగా స్పందిస్తారో అని అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు ఆసక్తిగా చూశాయి. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి రష్యా అధినేత పుతిన్, భారత ప్రధాని మోదీలు తొలిసారిగా ఒకే వేదికను పంచుకున్నారు. వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి, ఉక్రెయిన్ యుద్ధంపై 55 నిమిషాల పాటు చర్చ జరిగింది.
అయితే ఈ సమావేశంలో పీఎం మోదీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది యుద్ధాల కాలం కాదంటూ పుతిన్ తో నేరుగా చెప్పారు. అయితే ప్రధాని మోదీ ఇలా చెప్పడాన్ని అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా గొప్పగా ప్రశంసిస్తూ పలు కథనాలను రాసింది. ‘‘ ప్రధాని మోదీ ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్ ను మందలించారని’’ అని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. పుతిన్ ను మందలిస్తూ.. నేటి యుగం యుద్ధాల యుగం కాదని.. దీనిపై మీతో ఫోన్ లో కూడా మాట్లాడానని ప్రధాని మోదీ, పుతిన్ తో అన్నారని వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. అన్ని వైపుల నుంచి పుతిన్ పై ఒత్తడి ఉందని పేర్కొంది.
ప్రధాని మోదీ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ వివాదంపై మీ వైఖరి గురించి, మీ ఆందోళన గురించి నాకు తెలుసని.. వీలైనంత త్వరగా దీన్ని ఆపడానికి మేము మా వంతకు కృషి చేస్తున్నామని.. అయితే ఉక్రెయిన్ మాత్రం చర్చలను పక్కన పెట్టిందని.. వారు సైనిక మార్గాల ద్వారానే లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. అయినప్పటికీ అక్కడ ఏం జరుగుతుందో మేము ఎల్లప్పుడు మీకు తెలియజేస్తామని మోదీతో పుతిన్ అన్నారు.
మరో ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్.. ఇండియా లీడర్ పుతిన్‌కి ఇప్పుడు యుద్ధ యుగం కాదని చెప్పారు అని హెడ్డింగ్ పెట్టి కథనాన్ని ప్రచురించింది. ఇరు నాయకులు చరిత్రను ప్రస్తావించారని.. ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు సాగాయని.. ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ ఆందోళనలను అర్థం చేసుకుంటున్నట్లు పుతిన్ అన్నారని.. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్, పుతిన్ తో సమావేశం అయినతర్వాత మోదీ, పుతిన్ తో సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచురించింది.