నేడే ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. ధన్‌కర్‌ ఎన్నిక ఖాయమేనా?

0
143

భారత 16వ ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడు జరగనుంది. ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌కర్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి, గవర్నర్‌ మార్గరెట్‌ అల్వా ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. పోలింగ్ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు పార్లమెంట్ భవనంలో కొనసాగనుంది. పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులోని రూమ్ నెం.63లో పోలింగ్ జరగనుంది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఈ పోలింగ్ జరగనుంది. నూతన ఉపరాష్ట్రపతిని లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు ఎన్నుకోనున్నారు. లోక్‌సభకు చెందిన 543, రాజ్యసభకు చెందిన 245 మంది ఎన్నికలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో జమ్మూకశ్మీర్‌ నుంచి 4, త్రిపుర నుంచి 1, నామినేటెడ్‌ సభ్యులనుంచి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం 780 మందికి ఓటు వేసే హక్కు ఉంది. ఇందులో లోక్‌సభలో 23, రాజ్యసభలో 13 మంది సభ్యుల సంఖ్యాబలం ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించినందున ఆ పార్టీకి చెందిన 36 మంది సభ్యులు మినహాయించి మిగిలిన 744 మంది ఓటింగ్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంది. పోలింగ్ తర్వాత సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉండనుంది. అంటే ఈ రోజే భారత నూతన రాష్ట్రపతి ఎవరో తేలిపోనుంది.

పార్లమెంట్‌లో ఎన్డీయే కూటమికి సాధారణంగానే బలం ఎక్కువగా ఉండడంతో ఎన్డీయే అభ్యర్థి జగదీప్‌ ధన్‌కర్ ఎన్నిక లాంఛనమే. అధికార భాజపాకు లోక్‌సభలో 303, రాజ్యసభలో 91 కలిపి 394 ఓట్లున్నాయి. అభ్యర్థి గెలుపునకు కావాల్సిన 372+1కి మించిన ఓట్లు భాజపా ఒక్కదాని చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్డీఏ పక్షాల అభ్యర్థి జగదీప్ ధన్‌కర్‌కు మద్దతు వైసీపీ,టీడీపీ ,బీఎస్పీ, ఏఐఎడీఎంకే, శివసేన, బీజేడీ, ఆర్ఎల్జేపీ, జనతాదళ్‌ (యూ), శిరోమణి అకాళీదళ్‌, ఏజీపీ, ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్‌, ఎంఎన్‌ఎఫ్‌, ఎస్‌కేఎం, ఎన్‌డీపీపీ, ఆర్‌పీఐ-ఎ, పీఎంకె, అప్నాదళ్‌, ఏజేఎస్‌యు, టీఎంసీ-ఎ మద్దతు కూడా ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఎన్డీయే కూటమికి 544 ఓట్లు లభించే సూచనలున్నాయి. అంటే ఎలక్టోరల్‌ కాలేజీలో 73% ఓట్లు ధన్‌ఖడ్‌కు దక్కే అవకాశం ఉంది.

విపక్షాల అభ్యర్థికి మార్గరెట్ అల్వాకు కాంగ్రెస్, ఎన్సీపీ,డీఎంకే, టీఆర్ఎస్,ఆప్, జేఎంఎం, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, ఆర్ఎల్డీ, ఎస్పీ, ఎండీఎంకే, ఐయూఎంఎల్ మద్దతు తెలిపాయి. ఆగస్టు 10తో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది. 2017 ఎన్నికల్లో అధికారకూటమి అభ్యర్థి వెంకయ్యనాయుడికి 67.89% ఓట్లు దక్కగా.. ప్రతిపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకి 32.11% వచ్చాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా టీఎంసీ దూరం కావడం వల్ల అధికార పక్షానికి బలం పెరిగింది. కొత్త ఉపరాష్ట్రపతి ఈనెల 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ రోజు రాఖీపౌర్ణమి సెలవురోజైనప్పటికీ యథావిధిగా ఆ కార్యక్రమం కొనసాగనుంది. 12వ తేదీవరకు పార్లమెంటు జరుగనున్నందున చివరి రోజు కొత్త ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్‌హోదాలో సభను నిర్వహించే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here