ఉపరాష్ట్రపతి ఎన్నికలకు అంతా సిద్ధం అయింది. రేపు శనివారం పార్లమెంట్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదే రోజే ఎన్నికల ఫలితాలు వెలవడనున్నాయి. పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులోని రూం నెంబర్ 63లో పోలింగ్ జరగనుంది. సీక్రెట్ బ్యాలెట్ విధానం ద్వారా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉపరాష్ట్రపతి పదవి కోసం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్, ప్రతిపక్ష పార్టీ కూటమి అభ్యర్థిగా మార్గరేట్ ఆల్వాను పోటీలో దించారు. పార్లమెంట్ లోని ఉభయ సభల్లోని సభ్యులు ఉప రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎలక్టోరల్ కాలేజీలోని పార్లమెంట్ 790 మంది సభ్యులు ఉంటారు. రాజ్యసభలో 233 మంది ఎంపీలతో పాటు 12 మంది నామినేటెడ్ సభ్యులు, లోక్ సభలోని 543 మంది సభ్యులతో పాటు ఇద్దరు నామినేటెడ్ సభ్యులు ఓటింగ్ లో పాల్గొననున్నారు. అయితే ప్రస్తుతం రెండు సభల్లో కలిపి 788 మంది ఎంపీలు ఉన్నారు. వీరంతా ఎన్నికల్లో పాల్గొననున్నారు.
అయితే గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో మాదిరిగానే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్ కర్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇటు లోక్ సభలో, అటు రాజ్యసభలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికే ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు. అయితే కాంగ్రెస్ ప్రతిపాదించిన విపక్షాల అభ్యర్థి మార్గరేట్ ఆల్వా ఎంత వరకు పోటీ ఇస్తుందో చూడాలి. ప్రస్తుతం జగదీప్ ధన్ కర్ కు వైసీపీ, టీడీపీ, ఏఐఏడీఎంకే, శివసేన, బీజేడీ, ఆర్ఎల్పీ పార్టీలు మద్దతు ప్రకటించాయి.మరో వైపు మార్గరేట్ ఆల్వాకి కాంగ్రెస్ తో పాటు ఎన్సీపీ, డీఎంకే, టీఆర్ఎస్, ఆప్, ఆర్జేడీ, సీపీఎం, ఆర్ఎల్డీ, ఎండీఎంకే, ఎంఐఎం పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయితే గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిని నిలబెట్టిన త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి పదవీ కాలం ఆగస్టు 10తో ముగుస్తోంది.