సాధారణంగా మహిళలు కవల పిల్లలకు జన్మనివ్వడం అరుదుగా జరుగుతుంది. కొన్ని సార్లు ముగ్గురికి జన్మనిచ్చిన ఘటనలు చూశాం. అంతే కాదు నలుగురికి ఒకే కాన్పుల్లో జన్మనిచ్చిన ఘటనలూ అప్పుడప్పుడు విన్నాం. అయితే ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని కరౌలీ జిల్లాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. కానీ ఆ దంపతులకు ఈ ఆనందం ఎంతో సేపు లేకుండా పోయింది. పుట్టిన పిల్లల్లో ముగ్గురు వెంటనే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరి ఆరోగ్యం నిలగడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వీరిని మెరుగైన వసతులు ఉన్న జైపూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.
కరౌలీలో నివసింటే అష్రఫ్ అలీ భార్య రేష్మకు పురుటినొప్పులు రాగా.. ఆమె స్థానికంగా ఓ ఆస్పత్రిలో చేర్పించారు. సాధారణ ప్రసవం ద్వారానే మహిళ ఐదుగురు శిశువులకు జన్మనిచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. ఆ పుట్టిన పిల్లల్లో ఇద్దరు మగపిల్లలు కాగా.. ముగ్గురు బాలికలు జన్మించినట్లు వెల్లడించారు. పెళ్లయిన ఏడేళ్లకు సంతానం కలగడంతో ఆనందానికి గురైన ఆ దంపతులకు సంతోషం ఎంతో సేపు నిలవలేదు. పుట్టిన కాసేపటికే ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ దంపతులకు ఆనందం లేకుండా పోయింది. ఏడో నెలలోనే గర్భం నుంచి బయటకు వచ్చారని.. నెలలు నిండక ముందే జన్మించడం వల్ల శిశువులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
పుట్టిన చిన్నారులకు మెరుగైన చికిత్స అవసరమని భావించిన వైద్యులు.. శిశువులను కరౌలీలోని మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా పిల్లలు చనిపోయారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే ఒకే కాన్పులో ఐదుగురు చిన్నారులు జన్మించడం అరుదుగా జరుగుతుందని వైద్యులు తెలిపారు.