కెనడా వీసా ఆలస్యమవుతుందనే మనోవ్యథతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే విషాదకరంగా సదరు యువకుడు ఆత్మహత్య చేసుకున్న రోజే వీసా రావడం ఆ కుటుంబంలో మరింత విషాదాన్ని నింపింది. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి అక్కడే స్థిరపడాలని అనుకున్న యువకుడు.. ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.
హర్యానా కురుక్షేత్రకు చెందిన 23 ఏళ్ల యువకుడు కెనడా వెళ్లాలని కలలు కన్నాడు. అయితే వీసా కోసం దరఖాస్తు చేసి రోజులు గుడుస్తున్నా.. తన కన్నా తరువాత అప్లై చేసుకున్న వారికి వీసాలు వస్తున్నా.. తనకు రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ మనోవ్యథతో బాధపడుతున్న షహబాద్ లోని గోర్ఖా గ్రామానికి చెందిన వికేష్ సైని అలియాస్ దీపక్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం జన్సా టౌన్ సమీపంలోని కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం జన్సా కాలువ సమీపంలో వికేష్ సైనీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
విషాదం ఏంటంటే.. అతడు మిస్సైన మరుసటి రోజే అంటే గురువారం కెనడా వీసా వచ్చింది. ఈ విషయం తెలియన వికేష్ సైనీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వికేష్ సైనీ తల్లిదండ్రులు కూడా తమ కొడుకును ఉన్నతంగా చూడాలని..మంచి లైఫ్ ఇవ్వాలని భావించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మృతుడికి ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కెనడా వెళ్లి చదువుకోవాలని వికేష్ భావించాడు. అయితే తను బుధవారం కనిపించకుండా పోతే గురువారం వీసా వచ్చింది. కాగా వికేష్ అప్పటికే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
కోవిడ్ సడలించిన తర్వాత పలు దేశాల వీసాలు ఆలస్యం అవుతున్నాయి. దీంతో విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులు వీసాలు రాక మనోవ్యథకు గురవుతున్నారు. కెనడా వీసా ప్రక్రియకు దాదాపుగా 6 నెలల సమయం పడుతోంది. యూకే, యూఎస్ వీసాలు పొందడానికి కూడా సమయం పడుతోంది.