అగ్రరాజ్యం అమెరికాకి వలసల తాకిడి ఎక్కువైంది. దీంతో సంక్షోభం ఏర్పడి అక్కడ ఎమర్జెన్సీ ఏర్పాటుకు దారితీసింది. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోకి అక్రమ వలసదారులు భారీ సంఖ్యలో రావడంతో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దక్షిణ సరిహద్దు గుండా నగరంలోకి 20 వేల మందికి పైగా వలస వచ్చారు. రిపబ్లికన్ పాలిత రాష్ర్టాలైన టెక్సాస్, అరిజోనా, ఫ్లారిడా నుంచి డెమోక్రటిక్ రాష్ర్టాలకు వలసలు పెరిగిపోయాయి. సెప్టెంబర్ నుంచి ప్రతిరోజూ శరణార్థులతో కూడిన 5-6 బస్సులు న్యూయార్క్లో ప్రవేశిస్తున్నాయని ఆడమ్స్ తెలిపారు. నగర షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నవారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు శరణార్థులేనని పేర్కొన్నారు.
వలస వచ్చేవారిలో ఎక్కవగా చిన్నారులు ఉన్నారు. వారితో పాటు వైద్యసేవలు అవసరమున్న కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. వారందరినీ ఆదుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో తమకు రూ.వంద కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఈ వలసల వల్ల ఇతర పనులకు వెచ్చించేందుకు నిధులు లేకుండా పోయాయని వెల్లడించారు. కావాలనే రిపబ్లికన్ రాష్ర్టాల నుంచి జనాలను ఇక్కడికి పంపిస్తున్నారని మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఆరోపించారు. నగర సామాజిక సేవలను కొందరు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని రిపబ్లికన్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా, వెనిజులాకు చెందిన కార్లోస్ అనే శరణార్థి మీడియాతో మాట్లాడుతూ.. తమ దేశంలో డ్రగ్స్ సమస్య విపరీతంగా ఉన్నదని, నిరుద్యోగం, హత్యలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని తెలిపాడు. న్యూయార్క్ నుంచి మద్దతు లభిస్తుందన్న ఆశతోనే తాము వలస వస్తున్నామని పేర్కొన్నాడు. నిధుల కొరతతో ఉన్న తమకు ఫెడరల్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని మేయర్ కోరారు.