బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ అనెక్స్ భవనంలో కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో సమావేశం జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని అఖిలపక్ష నేతలను కేంద్రం కోరింది. అఖిలపక్ష సమావేశానికి కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్,పీయూష్ గోయల్,అర్జున్ రామ్ మేగ్వాల్,వి.మురళీధరన్ హాజరయ్యారు.
ఈ సమావేశానికి తెలుగురాష్ట్రాల నుంచి బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ పార్లమెంటరీ పక్ష నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, టీడీపీ నుంచి గల్లా జయదేవ్ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, ఆర్జేడీ నుంచి ప్రొఫెసర్ మనోజ్ ఝా, జేడీయూ నుంచి రామ్ నాథ్ ఠాకూర్ తదితరులు హాజరయ్యారు. శివసేన (ఉద్ధవ్ థాకరే) తరపున ప్రియాంక చతుర్వేది ప్రాతినిధ్యం వహించారు.
కాంగ్రెస్ నాయకులు సమావేశానికి గైర్హాజరయ్యారు, అయితే, ప్రభుత్వ వర్గాల ప్రకారం మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి ఇద్దరూ కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర ముగింపు సభ కారణంగా హాజరు కాలేదని తెలుస్తోంది.
బడ్జెట్ సమావేశాలు రెండు భాగాలుగా జరగనున్నాయి.పార్లమెంటు ఉభయ సభల ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంతో సెషన్ ప్రారంభమవుతుంది. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. కేంద్ర బడ్జెట్ 2023-24 లోక్‌సభ ఎన్నికలకు ముందు చివరి పూర్తి బడ్జెట్ కావచ్చు. మొదటి భాగం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనుంది.