ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి.. తొలి రోజు అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించిన తర్వాత సభ వాయిదా పడింది.. ఇక, అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత.. శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం నిర్వహించారు.. మొత్తంగా 9 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది బీఏసీ.. అంటే ఈ నెల 24వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగించనున్నారు.. ఇక, ఈ నెల 16వ తేదీన అంటే గురువారం రోజు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. మరోవైపు.. ఆదివారం కావడంతో ఈ నెల 19వ తేదీన.. ఉగాది సందర్భంగా ఈ నెల 22వ తేదీన అసెంబ్లీకి సెలవు ప్రకటించారు.. స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు బుగ్గన, పెద్దిరెడ్డి, జోగి రమేష్, ప్రసాద్ రాజు, శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు.. ఈ సమావేశాల్లో 20 అంశాలపై చర్చించాలని అడిగినట్టు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇక, గవర్నర్ ప్రసంగాన్ని మధ్యలోనే తెలుగుదేశం పార్టీ సభ్యులు వాకౌట్ చేసిన విషయం విదితమే.. ప్రసంగంలోని అన్ని అబద్ధాలు చెబుతున్నారంటూ నిరసన వ్యక్తం చేసిన టీడీపీ.. ముఖ్యంగా ప్రాజెక్టుల అంశంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.. ఈ అబద్ధాలు వినలేమంటూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.