ఈ నెల 28వ తేదీన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, ఆప్, టీఎంసీ ఇలా 19 పార్టీలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి.. ఈ ప్రారంభోత్సవం ప్రధాని చేతుల మీదుగా కాకుండా.. రాష్ట్రపతి చేతుల మీదుగా జరగాలని ప్రధాన డిమాండ్‌గా ఉంది.. అయితే, కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయబోతున్న ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపిన ఆయన.. ఈ సమయంలో విపక్షాల తీరును తప్పుబట్టారు.
సీఎం వైఎస్ జగన్ చేసిన ట్వీట్ విషయానికి వస్తే.. ‘‘పార్లమెంటు అనేది ప్రజాస్వామ్య దేవాలయం.. అది మన దేశం యొక్క ఆత్మను ప్రతిబింబిస్తుంది. అది మన దేశ ప్రజలకే కాదు, అన్ని రాజకీయ పార్టీలకు చెందినది. ఇలాంటి శుభకార్యక్రమాన్ని బహిష్కరించడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు.. రాజకీయ విభేదాలన్నింటినీ పక్కనపెట్టి, ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని పొలిటికల్ పార్టీలు హాజరుకావాలని కోరుతున్నా.. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి వైసీపీ హాజరవుతుంది’’ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్.. కాగా, కేంద్ర ఆహ్వానం మేరకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పార్టీ బిజూజనతా దళ్(బీజేడీ), అకాలీదళ్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.. మరోవైపు.. విపక్షాల బహిష్కరణపై బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్(ఎన్డీయే) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య గౌరవం కలిగించేది కాదని, ఇది మన గొప్పదేశ ప్రజాస్వామ్య నీతి, రాజ్యంగ విలువకు అవమానం అని పేర్కొంది. ప్రతిపక్షాల చర్యలను మేధోపరమైన దివాళాగా అభివర్ణించింది. ప్రజాస్వామ్యానికి ధిక్కారంగా, ద్రోహంగా పేర్కొంది.