అందరిలా మాస్ మసాలా కమర్షియల్ చిత్రాల జోలికి పోకుండా.. కొత్తదనానికి పెద్దపీట వేస్తారు సుకుమార్. ప్రతి సినిమాను ఆడియన్స్‌కు ఓ పజిల్లా రూపొందించగల అరుదైన దర్శకుడు సుకుమార్. రీసెంట్గా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో రంగస్థలంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎప్పుడూ క్రేజీ టైటిల్స్‌తో జనాన్ని ఆకట్టుకునే సుక్కు.. ఈ సారి అచ్చ తెలుగు టైటిల్ పెట్టడం అందరిని ఆలోచింపచేస్తోంది. ఈ నేపథ్యంలో రంగస్థలం గురించి సుకుమార్ చెప్పిన ఆసక్తికరమైన విశేషాలు మీ కోసం.
అతను అన్న మాటకు సిగ్గేసింది.
నేను పుట్టింది.. పెరిగింది అంతా పల్లెటూళ్లోనే.. పల్లెటూరితో నాకు మంచి అనుబంధం ఉంది. నేను తీసిన వన్ నేనొక్కడినే.. నాన్నకు ప్రేమతో సినిమాలు ఓవర్సీస్లో మంచి కలెక్షన్లు సాధించాయి. మొన్నామధ్య నేను అమెరికా వెళ్లినప్పుడు ఒక తెలుగు వ్యక్తి నన్ను గుర్తుపట్టి.. మీరు తీసిన సినిమాలు హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి.. కానీ మీలాంటి వ్యక్తి గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలు కూడా చేయొచ్చు కదా అన్నారు.. ఆ మాట విని నాకు సిగ్గేసింది.. పల్లెటూళ్లో పుట్టిన నేను.. అలాంటి నేపథ్యంతో ఎందుకు సినిమా తీయకూడదు అనిపించింది.. దీనికి సమాధానమే రంగస్థలం.
ఈ సినిమా ఆ కాలం నాటి జ్ఞాపకాల్ని గుర్తు చేస్తుంది.
1985లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనలకు వాస్తవ రూపమే రంగస్థలం. నాకు తెలిసిన, నేను చూసిన ఘటనలకు ఇందులో స్థానం కల్పించాను.. ఇది అందరికి నచ్చుతుంది. ఆ కాలం దాటి వచ్చిన వారికి మళ్లీ ఆ అనుభూతుల్ని గుర్తు చేస్తుంది. ఏం మిస్సయ్యారో ఈ జనరేషన్ తెలుసుకుంటుంది.
మంచి టెక్నీషియన్స్ వల్ల ఏ మాత్రం కష్టపడలేదు
ఈ సినిమా కోసం నాకు మంచి టెక్నీషియన్స్ దొరికారు.. అందువల్ల నా పని చాలా తేలికయ్యింది. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ, మౌనిక మంచి సెట్స్ వేశారు. సెట్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. చంద్రబోస్ అయితే కేవలం పది నిమిషాల్లో అడిగిన పాట రాసిచ్చారు.
గొల్లభామ అంటే మనిషి కాదు అదొక కీటకం
ఈ సినిమాలోని రంగమ్మ మంగమ్మ సాంగ్‌లోని గొల్లభామ అన్న పదం వివాదాస్పదమైంది. గొల్లభామ వచ్చి నాగోరు గిల్లుతుంటే’ చరణం యాదవ మహిళలను కించపరిచేలా ఉందని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్ ఆరోపించారు. కానీ గొల్లభామ అనే పదం మనుషులను ఉద్దేశించింది కాదు అదొక పురుగు. ఆ పురుగు అందరికీ తెలిసే ఉంటుంది.