కేంద్రంపై ఒత్తిడి పెడుతున్నది. మొన్నటి వరకు కేంద్రంతో కలిసి ఉన్న టిడిపి, జనసేనలు ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాయి. జనసేన బయటి నుంచి మాత్రమే అప్పట్లో మద్దతు తెలిపింది. ఎన్డీఏ మిత్రపక్షంగా లేదు. మొన్నటి వరకు టిడిపి మిత్రపక్షంగాఉంది. కాని కొన్ని కారణాల వలన మిత్రపక్షం నుంచి తప్పుకొని కేంద్రంపై యుద్ధం మొదలుపెటింది. ఇక మొన్నటి వరకు ఇటు రాష్ట్రమైన అటు కేంద్రంపైనా నిప్పులు చెరిగిన వైకాపా ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నది. ఈ మూడు పార్టీలు ఏకమైతే కేంద్రంపై బీజేపీపై పోరాటం చేయాలని అంటున్నారు ఉండవల్లి.
1. మొన్నటివరకు కేంద్రంతో కలిసి ఉన్న టిడిపి ఇప్పుడు సడెన్ గా తన స్టాండ్ మార్చుకోవడం మంచిదేనా..?
ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీలు ఎన్నో హామీలు ఇచ్చాయి. ఈ హామీల్లో ఒకటి ప్రత్యేక హోదా. ఐదేళ్లు కాదు పదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. కానీ, కేంద్రం ఇచ్చిన హామీని పక్కకు పెట్టి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాలను, రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి. ఇది ఎంతవరకు సమంజసం. మిత్రపక్షంలో ఉన్న పార్టీలకు విలువ ఇవ్వకుండా.. ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై మొదటి నుంచి జనసేన పార్టీ వ్యతిరేకంగానే ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు కేంద్రం నుంచి బయటకు వచ్చారు. అందుకు సంతోషం. వైకాపా కేంద్రంపై అవిశ్వాసం పెడతామంది. ఇప్పుడు టిడిపి అవిశ్వాస తీర్మానం పెడతామని అంటోంది. ఇద్దరిలో ఎవరు అవిశ్వాసం పెట్టినా మంచిదే. పవన్ పట్టువల్లే టిడిపి కేంద్రంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుంది.
2. బీజేపీ ప్రభుత్వం పై పెడుతున్న అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా..?
అది రెండో విషయం. ఇక్కడ మొదటి విషయం ఏమిటంటే.. నిన్నా మొన్నటివరకు ఎన్డీఏ లో మిత్రపక్షంగా ఉన్న పార్టీ సడెన్ గా బయటకు వచ్చి అవిశ్వాసం పెడుతుంది అంటే దానిపై అన్ని పార్టీలు ఆలోచిస్తాయి. బీజేపీపై ఇప్పటికే చాలా పార్టీల్లో వ్యతిరేకత ఉంది. కాని మోడీ ఛరిష్మా వలన ఆ వ్యతిరేకత కనిపించడంలేదు. సొంత పార్టీలోనే మోడీని వ్యతిరేకించేవారు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చర్చకు పట్టుబడితే.. దాదాపుగా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ సమయంలోనే చంద్రబాబు తన పలుకుబడిని ఉపయోగించాలి. అవిశ్వాసానికి ఓటింగ్ జరిగే విధంగా చూడాలి. నెగ్గుతుందా లేదా అన్నది రెండో విషయం. ముందు అవిశ్వాస తీర్మానంపై చర్చించేవరకు వెళ్తే చాలు. కేంద్రంలో తప్పకుండా కదలిక వస్తుంది.
3. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడారు.. బీజేపిని ఎక్కడా వ్యతిరేకించినట్టు దాఖలు లేవు. ఇది బాబుపై జరుగుతున్న కుట్రగా భావించాలా..?
బీజేపి నిర్ణయాలను మొదటగా వ్యతిరేకించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. పార్టీలో మిత్రపక్షంగా ఉన్నా.. ప్రజల సంక్షేమానికి కావలసిన నిర్ణయాలు తీసుకోకపోతే.. ప్రజల తరపున మొదటగా మాట్లాడింది పవన్ కళ్యాణ్. స్వలాభం కంటే.. ప్రజాలాభమే ముఖ్యమనుకునే వ్యక్తి పవన్. అందుకే మోడీకి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. అలాగే, రాష్ట్రంలో బాబు తీసుకుంటున్న నిర్ణయాల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారు. అలాంటి సమయంలో బాబుకు వ్యతిరేకంగా పవన్ ప్రజలపక్షాన నిలబడవలసి వచ్చింది. బీజేపి కి అనుకూలం, టిడిపికి వ్యతిరేకం అనుకోవడం ముముమ్మాటికి తప్పు. పవన్ ప్రజలకు అనుకూలమైన మనిషి.
4. పార్లమెంట్లో టిడిపి ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం నిలబడుతుందా..?
అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందుతుందా లేక వీగిపోతుందా అన్నది వేరే విషయం. చంద్రబాబు తెలివిగా వ్యవహరిస్తే.. తప్పకుండా దానిపై చర్చ జరుగుతుంది. అయితే, ఎంపీలు పోడియంలోకి వెళ్లి గొడవచేయకుండా ఉండాలి. చర్చకు పట్టుబట్టాలి. అప్పుడే చర్చకు వస్తుంది. ఎన్ని పార్టీలు అనుకూలంగా ఉంటాయో అప్పుడే అర్ధం అవుతుంది. 2019 ఎన్నికల కంటే టిడిపి ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానమే పెద్ద పరీక్ష. ఒకవేళ అవిశ్వాసంపై చర్చ జరగకుంటే అది చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ అయినట్టే. ఒకవేళ అవిశ్వాసంపై చర్చజరిగితే దానిని బాబు స్వప్రయోజనాలకు వాడుకోకుండా ప్రజలకు కోసం వినియోగించాలి. అప్పుడే బాబు చెప్పే మాటలను ప్రజలు నమ్ముతారు.
5. అవిశ్వాస తీర్మానానికి వైకాపా మద్దతు ఇస్తుందా..?
కేంద్రంలో బీజేపీకి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయడంతో.. ప్రతిపక్షంలో ఉన్న వైకాపా వ్యతిరేకంగా ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం కావడంతో వైకాపా కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టాలని అనుకుంది. తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేంద్రం పట్టించుకోకపోవడంతో తప్పనిసరి పరితిస్థితుల్లో బాబు ఎన్డీఏ నుంచి బయటకు ఇలా బయటకు రావడంతో పాటు తామే అవిశ్వాసం పెడతాం అనడం శుభపరిణామమే. అయితే, ఈ అవిశ్వాస తీర్మానం ఆమోదం అయ్యే విధంగా బాబు తన తెలివిని ఉపయోగించాలి. కేంద్రంలో బీజేపి వ్యతిరేకంగా ఎన్నిపార్టీలు ఉన్నాయో వాటి మద్దతును కూడగట్టాలి. అలాగే, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంలో ఉన్న వైకాపా మద్దతు కూడా బాబుకు అవసరం. ఒకవేళ బాబు నిర్లక్ష్యంగా వ్యవహరించి వైకాపాను దూరం చేసుకుంటే.. దానివలన టిడిపికి నష్టం చేకూరే అవకాశం ఉంది. సొంత రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మద్దతే సంపాదించలేనప్పుడు.. ప్రత్యేక హోదా కోసం దేశంలోని మిగతా పార్టీల మద్దతును ఎలా కోరతారని అడుగుతారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు కూడా మోడిలా ఏకపక్షంగా వ్యవహరించారు అని వైకాపా విమర్శిస్తే.. టిడిపి పరువు గంగపాలవుతుంది. సో, బేధాలు, కోపాలు పక్కన పెట్టి ఒకే అజెండాపై ఇద్దరు పనిచేస్తేనే విజయం లభిస్తుంది.