దేశంలో అతిపెద్ద ఎంపీ నియోజక వర్గాల్లో ఒకటి నల్గొండ జిల్లాలోని భువనగిరి నియోజక వర్గం. ఈ నియోజక వర్గం కింద దాదాపు ఆరు జిల్లాలు ఉన్నాయి. ఒకప్పుడు టిడిపి కి కంచుకోటగా ఉన్న ఈ నియోజక వర్గం విభజన తరువాత తెరాస చేతుల్లోకి వెళ్ళింది. ఆ నియోజక వర్గం నుంచి బోరా నర్సయ్య గౌడ్ ఎంపీగా విజయం సాధించారు. వృత్తిపరంగా డాక్టర్ అయినప్పటికీ, రాజకీయాలపై మక్కువతో తెరాస పార్టీ తరపున పోటీ చేసి 2014 లో ఎంపీ గా విజయం సాధించారు. కేంద్రం నుంచి నిధులను రాబట్టుకోవడంలోనూ, ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోవడంలోనూ బూర నర్సయ్య గౌడ్ ముందు వరసలో ఉంటాడు. బీజేపీ మంత్రులతోనూ, బీజేపీ నాయకులతోనూ మిగతావారికన్నా ఎక్కువ సఖ్యతగా ఉండటం వెనుక అసలు రహస్యం ఏమిటో తెలుసుకుందాం.
అవిశ్వాస తీర్మానానికి తెరాస మద్దతు విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నది..?
ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ నాలుగు సంవత్సరాలు మిత్రపక్షంగా ఉంది. మిత్రపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడని టిడిపి, నాలుగు సంవత్సరాల తరువాత బయటకు వచ్చి సడెన్ గా పోరాటం చేస్తాం.. అవిశ్వాస తీర్మానం పెడతాం మద్దతు ఇవ్వండి అనడం విచిత్రంగా ఉంది. నాలుగు సంవత్సరాలు మిత్రపక్షంగా ఉంది, కేంద్రంలో మంత్రిపదవుల్లో ఉన్న టిడిపి వాళ్లకు చిత్తశుద్ధి ఉంటె, కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వం అని చెప్పిన రోజునుంచే పోరాటం చేయాల్సింది. ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపైనా తెరాస పార్టీ ఎప్పుడు మద్దతు ఇస్తుంది. అవిశ్వాసం అన్నది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ మాత్రమే. టిడిపి, వైకాపాలు అవిశ్వాసం ప్రవేశపెట్టినంత మాత్రాన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పడిపోతుందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. తెరాస అధినేత కెసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి తెరాస ఎంపీలు కట్టుబడి ఉంటారు.
తెరాస అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోవడం వెనుక బీజేపీ హస్తం ఉందని కాంగ్రెస్ ఆరోపణ.. అది ఎంతవరకు నిజం..?
ఆరోపణలు ఎప్పుడు వాస్తవాలు కావు. కేంద్రం ఇంతవరకు హై కోర్ట్ ను డివైడ్ చేయలేదు. కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు ఇంకా రాలేదు. రాష్ట్రానికి రావాల్సినవి చాలా వరకు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ విషయాలపైనా కాంగ్రెస్ అవిశ్వాసం పెట్టొచ్చుకదా.. మరెందుకు అవిశ్వాసం పెట్టలేదు. ఇప్పుడు టిడిపి, వైకాపాలు అవిశ్వాసం ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మద్దతు ఇస్తున్నది. అవిశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నది. అవిశ్వాసం పేరుతో వర్సెస్ మిగతా విపక్షాలు అంటూ డివైడ్ చేసి రాజకీయాలు చేస్తున్నారు. దీనివలన ఆంధ్రప్రదేశ్ కు నష్టమే తప్పించి లాభం ఉండదు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏదైతే అంతిమ లక్ష్యం ఉంటుందో అది నెరవేరదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ విషయాన్ని గుర్తుంచుకొని మసలుకుంటే మంచిది.
రిజర్వేషన్ విషయంలో తెరాస ఎంపీలు స్పీకర్ వెల్ లోకి వెళ్లి నినాదాలు చేయడం రాజకీయం కాదా..?
రాజకీయాలు వేరు.. డ్రామాలు వేరు. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో రిజర్వేషన్ శాతం ఒక్కో విధంగా ఉంది. ఒకే దేశం ఒకే లా ఉండాలి అన్నది తెరాస నినాదం. దానికోసమే తెరాస పోరాటం చేస్తున్నది. తెరాస చేస్తున్న రిజర్వేషన్ పోరాటానికి రాజస్థాన్, ఝార్ఖండ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు మద్దతు ఇస్తున్నాయి. రిజర్వేషన్ అంశం ఇప్పటికిప్పుడు సాల్వ్ అవుతుంది అనుకోవడం లేదు. కాకపొతే ఇప్పుడు ఈ అంశాన్ని ఫోకస్ చేయడం వలన దానిపై చర్చ తప్పకుండా జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన రిజర్వేషన్ వస్తే మంచిదే కదా.
థర్డ్ ఫ్రంట్ పేరుతో కెసిఆర్ ఏర్పాటు చేస్తున్న కూటమి సక్సెస్ అవుతుందా..? ఫ్రంట్ పేరుతో వచ్చిన కూటములు ఫెయిల్ అయ్యాయి కదా..?
బీజేపీ కి వ్యతిరేకంగా కొన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని పార్టీలు ప్రత్యేక కూటములు ఏర్పాటు చేస్తున్నాయి. వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్న కూటములు ఎంతవరకు సక్సెస్ అవుతాయి అన్నది ఆయా కూటములకు సంబంధించిన అంశం. ఇప్పటివరకు ఏర్పడిన కూటములు అన్నీకూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఏర్పడినవి. రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం ఒక స్పష్టమైన అజెండా తో కూటములు ఏర్పడలేదు. కాని, మొదటిసారిగా దేశం మొత్తం అభివృద్ధి చెందాలి అనే అంశంతో ఒక స్పష్టమైన అజెండాతో థర్డ్ ఫ్రంట్ కూటమిని ఏర్పాటు చేస్తున్నారు. తప్పకుండా సక్సెస్ అవుతుంది అనే నమ్మకం ఉంది.
వచ్చే ఎన్నికల్లో బోరా నర్సయ్య గౌడ్ ఎంపీగా కంటే ఎమ్మెల్యే గానే పోటీ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.. అలాగే ఎమ్మెల్యేల దృష్టిలో ఎంపీ లంటే చులకన భావం ఉందని అంటున్నారు.. ఇది నిజమేనా..?
ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలి... ఎమ్మెల్యేగా పోటీ చేయాలా లేదంటే ఎంపీగా పోటీ చేయాలా అనే అభిప్రాయాలు మనకు ఉండొచ్చు.. అయితే, అంతిమంగా ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే అంశాలపై నిర్ణయం తీసుకునేది అధినేత కెసిఆర్ గానే. కెసిఆర్ గారు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. పార్టీ అభిప్రాయాలే గాని, సొంత అభిప్రాయాలకు తావుండదు. ఇక ఎంపీలపై ఎమ్మెల్యేలకు చిన్న చూపు ఉంది అనే విషయం పూర్తిగా అవాస్తవం. ఒక గ్రామానికి సర్పంచ్, నియోజక వర్గానికి ఎమ్మెల్యే, ఎంపీ నియోజక వర్గానికి ఎంపీ ఉంటాడు. ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్తే ఇటువంటి పుకార్లకు తావుండదు.
మోడీ ఆలోచనలకు అనుగుణంగానే కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ కూటమిని ఏర్పాటు చేశారని, గత కొంతకాలంగా కెసిఆర్ మోడీతో సంఖ్యతగా ఉండటమే ఇందుకు నిదర్శనం అంటున్నారు..?
మోడీగారితో సఖ్యతగా ఉన్నమాట వాస్తవమే. మోడీగారితో సఖ్యతగా ఉన్నంత మాత్రాన ఎన్డీఏ లో చేరిపోతారా.. లేదు కదా. కొన్ని పనులు జరగాలన్నా.. కొన్ని ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోవాలన్న, రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవాలన్నఆ కేంద్రప్రభుత్వంతో సఖ్యతగా ఉండటం చాలా అవసరం. మోడీ బెస్ట్ ఫ్రెండ్ అని కెసిఆర్ చెప్పిన మాట వాస్తవమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకుంటేనే అభివృద్ధి జరుగుతుంది. ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటే ఒరిగేదేమి ఉండదు. అభివృద్ధి కుంటుపడుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిది.