మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. అనతికాలంలో తనమార్క్ డ్యాన్సులు, ఫైట్లతో టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్. కమర్షియల్ హీరోగా తనపై ఉన్న ముద్రను చెరిపివేసుకోవడానికి చిట్టిబాబుగా మనముందుకు వస్తున్న చరణ్.. ఈ శుక్రవారం ఆయన నటించిన రంగస్థలం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు రామ్ చరణ్ అవేంటో ఒకసారి చూద్దాం.
కమర్షియల్ సినిమాలు చేసే మీరు ఇలా ఎందుకు మారాల్సి వచ్చింది..?
వెండితెరకు పరిచయమై పదేళ్లయ్యింది.. ఇంకా ఏమైనా కొత్తగా చేయాలి.. మంచి పాత్రల్లో కనిపించాలి అనే కోరిక బలంగా నాటుకుపోయింది. బ్రూస్లీ తర్వాత నా మైండ్‌సెట్ మారిపోయింది.. ఆ మార్పు ధృవ నుంచి వచ్చింది.
పదేళ్ల ప్రయాణంలో నటుడిగా ఏం నేర్చుకున్నారు..?
నటుడు అనేవాడు నిరంతర విద్యార్థి లాంటివాడు. జీవితంలో నేర్చుకోవడం ఆపకూడదు.. ఈ విషయంలో నాన్నగారే నాకు ఆదర్శం. సినిమాలకు దూరమై పదేళ్ల తర్వాత ఖైదీ నంబర్ 150 షూటింగ్ టైంలో ఆయనలోని ఉత్సాహం చూసి ఆశ్చర్యం వేసింది. ఆ వయసులో జిమ్‌కి వెళ్లమంటే వెళ్లారు. బరువు తగ్గమంటే తగ్గారు. 60 ఏళ్ల తరువాత కూడా ఆయన అలా ఉంటే.. ఆయనలో సగం వయసు కూడా లేని మేమింకా ఎంత క్రమశిక్షణతో ఉండాలి అనిపించింది.
రంగస్థలానికి వెంటనే ఒకే చెప్పేశారా..?
కొత్తగా ఏమైనా చేయాలి అనుకుంటున్న టైంలో రంగస్థలం నా దగ్గరకు వచ్చింది. సుక్కు స్టోరీ లైన్ చెప్పగానే గట్టిగా నవ్వేశాను.. షాకింగ్‌గా అనిపించింది. నాన్న అయితే ఇది వర్కవుట్ అవుతుందా అని సందేహించారు. కానీ కథంతా విన్న తర్వాత చిట్టిబాబు క్యారెక్టర్ చరణ్‌కి రావడం.. నటుడిగా నాకు చాలా ఈర్ష్య కలిగిస్తోంది అన్నారాయన?
చిట్టిబాబు పాత్ర కోసం ఎలా ప్రిపేరయ్యారు..?
సుకుమార్ చాలా ఇష్టంగా రాసుకున్న పాత్ర ఇది.. ఇలాంటి క్యారెక్టర్ చేయడం కొత్త.. చిట్టిబాబులా మారడానికి చాలా ప్రయత్నాలు చేశా.. గోదావరి జిల్లా వాడినైనా గోదావరి యాస కోసం ప్రత్యేకంగా నలుగురు ట్యూటర్స్‌ని పెట్టి నేర్చుకున్నా.. ఇక సుకుమార్ నాన్నగారి ఊరికిచ్చిన మాట.. మన ఊరి పాండవులు, రజనీకాంత్ గారి సినిమాలు కొన్ని రిఫరెన్స్ కోసం చూశాను..
ఈ షూటింగ్ టైంలో ఏం నేర్చుకున్నారు.?
మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ చేశాం.. గిరిజనులు ఉండే ఏరియాల్లో తిరిగాం.. వాళ్ల లైఫ్ స్టైల్, ఆహార అలవాట్లు.. ముఖ్యంగా అక్కడి రుచులు బాగా నచ్చాయి. అప్పుడప్పుడూ పల్లెటూర్లకు వెళ్లడం.. సినిమాల్లో చూడటం తప్ప.. గ్రామీణ వాతావరణం పూర్తిగా ఆస్వాదించాను.
సుకుమార్‌తో పనిచేయడం ఎలా అనిపించింది..?
సుకుమార్ ఓ మేథావి... ఎప్పుడు ఇంటెలెక్చువల్ కథలే తీస్తుంటారు. నన్ను కలిసినప్పుడు ఈసారీ లెక్కల మాస్టారులా ఆలోచిస్తావా అని సరదాగా అడిగాను.. మంచి కథ చెబుతానని రంగస్థలం కథ చెప్పాడు. మనకాలం కంటే చాలా అడ్వాన్స్‌గా ఆలోచించే వ్యక్తి.. హృదయాన్ని స్పృశించే కథ చెప్పడంతో ఆశ్చర్యపోయా. ఆయనకు పర్ఫెక్షన్ కావాలి.. అందుకోసం సుక్కు ఎంత రిస్కైనా తీసుకుంటారు.. ఆయనతో సినిమా తీయాలంటే ఓర్పు, సహనం అవసరం.
నిర్మాతగాను రాణిస్తున్నారు ఎలా అనిపిస్తుంది..?
నాన్నగారి రీఎంట్రీ సినిమాను నేనే నిర్మించాలి అనుకున్నా.. నేను కాకపోతే చిరంజీవి గారి కోసం వందమంది నిర్మాతలున్నారు. కానీ నాన్నగారితో కలిసి పనిచేయడం వల్ల ఎన్నో కొత్త విషయాల్ని నేర్చుకునే అవకాశం కలిగింది. ప్రస్తుతం సైరా రెండో షెడ్యూల్ జరుగుతోంది.
సైరాలో గెస్ట్ రోల్ ఏమైనా చేస్తున్నారా..?
సైరా పూర్తిగా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి.. అందులో కొత్తగా పాత్రలను సృష్టించలేం.. అన్నీ నిజమైన పాత్రలే వుంటాయి. వాటిలో నాకేదైనా సూటయితే తప్పకుండా చేస్తాను.. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదు.. నేను కూడా నాకు ఓ పాత్ర ఇమ్మని అడిగాను.. వాళ్లు ఇవ్వలేదు (నవ్వుతూ).
రంగస్థలాన్ని ఇంట్లో వాళ్లకు చూపించారా..?
ఉపాసన ఇంకా రంగస్థలం చూడలేదు.. అమ్మానాన్నలకు మాత్రం చూపించాను. సినిమా చూసిన తర్వాత అమ్మ ఎంతో భావోద్వేగానికి గురైంది. కథలోని ఎమోషన్ అమ్మను అంతగా కదిలించింది. సినిమా చూసిన తర్వాత నన్ను తన పక్కనే కూర్చోమని అడిగింది. ఆ క్షణంలో అమ్మ కళ్లలో కన్నీళ్లు చూశాను. అవే ఎన్నో అవార్డులతో సమానం.
కథ వినకుండా ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్ ఒకే చెప్పేశారా..?
ఆ సినిమాకు సంబంధించిన వివరాలేవి తెలియదు.. నేను కానీ ఎన్టీఆర్ కానీ సబ్జెక్ట్ వినలేదు. కథ ఎంటన్నది రాజమౌళి గారి దగ్గరే ఉంది.. మీ ఇద్దరినీ కూర్చోబెట్టి కథ చెబుతా అన్నారాయన. తప్పకుండా మంచికథే చెబుతారనే నమ్మకంతో ఒకే చెప్పేశాం. నేను తారక్ కలిసి స్టోరీ డిస్కషన్ చేసుకుంటాం.