ఇండస్ట్రీకొచ్చి పదిహేనేళ్లు గడుస్తున్నా.. తనకన్నా వెనుకవచ్చిన వాళ్లు స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తోన్నా.. హిట్లొచ్చినా.. ఫ్లాప్స్ వచ్చినా సినిమాలు తీసుకుంటూ వెళ్తొన్న నటుడు నితిన్. ఆయన ప్రాణ స్నేహితుడు కృష్ణ చైతన్య డైరెక్టర్‌గా.. ఇష్టమైన డైరెక్టర్ త్రివిక్రమ్, తండ్రి సుధాకర్ రెడ్డి, ఆరాధ్య నటుడు పవన్ కళ్యాణ్ కలిసి నిర్మించిన ఛల్ మోహన్ రంగ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్‌కానుంది.. దానితో పాటు శుక్రవారం నితిన్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం.
25 సినిమాలు.. పదిహేనేళ్ల కెరీర్‌ని చూస్తే.. ఏమనిపిస్తుంది..?
ఇది చాలా ఎమోషనల్ జర్నీ.. స్టార్టింగ్‌లోనే వరుస విజయాలను చూశా.. ఆ తర్వాత ఫ్లాప్స్ పలకరించాయి. హీరోగా కెరీర్ ఎండ్ అవుతుందా అనుకున్న టైంలో మళ్లీ లేచి నిలబడ్డా.. ఇకపై ఎలాంటి ఎదురుదెబ్బలు తగిలినా తట్టుకుంటానే నమ్మకం ఏర్పడింది. ఇప్పుడున్న పోటీలో అప్పుటిలా ఫ్లాప్స్ ఇస్తే కష్టమే.. కచ్చితంగా ఏడాదికి ఒక్క హిట్టైనా ఖాయంగా ఇవ్వాల్సిందే.
దిల్‌రాజుతో సినిమా తీయడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది..
కెరీర్ స్టార్టింగ్‌లోనే దిల్‌రాజుతో సినిమా చేశా..? ఆ తర్వాత మా కాంభినేషన్లో మరో సినిమా చేయాలని ఎంతో ప్రయత్నించాం. కానీ మేం కలవకూడదని కొద్దిమంది మా మధ్య పుల్లలు పెట్టారు. ఇప్పుడు అంతా క్లియర్ అయ్యింది. దిల్‌రాజు బ్యానర్లో శ్రీనివాస కల్యాణం చేస్తున్నా..
కృష్ణచైతన్యకి ఓకే ఎలా చెప్పారు..?
ఇష్క్ సినిమా నుంచి కృష్ణచైతన్య నాకు మంచి మిత్రుడయ్యాడు. తరువాత తను డైరెక్టర్‌గా తీసిన ఫస్ట్ మూవీ రౌడీఫెల్లో విడుదలైంది.. సినిమా టాక్ గురించి తను నాకు ఫోన్ చేశాడు. టాక్ బాలేదు కానీ.. డైరెక్టర్‌గా, రైటర్‌గా మంచి పేరొచ్చిందనిన చెప్పాను. సినిమా పోయిందని ఫీలవ్వకు మంచి కథ తయారు చేసుకో ఇద్దరం కలిసి సినిమా చేద్దామని చెప్పాను.. అలా వచ్చిందే ఛల్ మోహన్ రంగ..
త్రివిక్రమ్-పవన్ కల్యాణ్-నితిన్ ఈ కాంభినేషన్ ఎలా సెట్టయ్యింది..?
"అఆ" తర్వాత త్రివిక్రమ్ గారు నాకు ఈ కథ వినిపించారు. అయితే చేయాల్సిన ఇతరత్రా సినిమాల వల్ల దీనికి దర్శకత్వం వహించడం కుదరని పరిస్థితి. మరో రెండేళ్ల తర్వాత తీస్తే.. అప్పటికి ఈ కథ పాతదైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణచైతన్య పేరు చెప్పారు త్రివిక్రమ్. మొదటగా మా నాన్న, త్రివిక్రమ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించారు. దీని గురించి ఒక రోజు త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ దగ్గరికి వెళ్లి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాం.. మీరు మాత్రమేనా..? నేను కూడా నిర్మాతగా ఉంటా..? అన్నారాయన. ఆ మాటతో నేను షాక్ అయ్యా..? నా 25వ సినిమాకి త్రివిక్రమ్ కథ ఇచ్చి.. నిర్మాత కావడమే గొప్ప విషయం అనుకొంటే, నేను ఎంతో ఇష్టపడే పవన్ అందులో భాగస్వామి కావడం చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది.
పవన్ కల్యాణ్ గారు సినిమాలో కూడా కనిపిస్తారా..?
సినిమాకి కల్యాణ్ గారు నిర్మాత.. సినిమాలో ఆయన లేరు కానీ.. సినిమా మొత్తం ఉంటారు. అదెలా అనేది వెండితెరపై చూడాల్సిందే.
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటీ..?
సినిమాలో నా పాత్ర పేరు మోహన్‌రంగ. ఎలాగైనా అమెరికా వెళ్లి లైఫ్‌లో సెటిలవ్వాలనే అబ్బాయ్ క్యారెక్టర్. సినిమా మొత్తం వినోదాత్మకంగా సాగుతుంది. ఇంతవరకు నటించిన సినిమాల్లో నేను కామెడీని పూర్తి స్థాయిలో పండించిన సినిమా అంటే గుండెజారి గల్లంతయ్యిందే.. ఇందులో అంతకు మించి వినోదాన్ని పండిస్తా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హీరో కనిపించిన ప్రతిపాత్రను ఒక ఆట ఆడుకుంటాడు. త్రివిక్రమ్ తరహా పంచ్‌లుంటాయి.
ఎన్నో ఆశలు పెట్టుకున్న "లై" రిజల్ట్ మిమ్మల్ని నిరాశపరిచిందా..?
అది ఓ ఇంటిలెక్చువల్ మూవీ.. మధ్యో ఫోన్లో మాట్లాడుతూ ఒక నిమిషం బయటికి వెళ్లినా సినిమా ఏం అర్థంకాలేదు. ఆ సినిమా రిలీజైన టైమ్ కూడా మంచిది కాదు.. రెండు, మూడు సినిమాల మధ్య విడుదలైంది. ఏ సినిమా చూడాలి అన్న దానిపై ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అయ్యాడు.
శ్రీనివాస కల్యాణం సరే మీ కల్యాణం ఎప్పుడు..?
35లోకి అడుగుపెడుతున్నావ్. పెళ్లి చేసుకో.. అని ఇంట్లో రోజూ అడుగుతున్నారు. నేను ప్రేమలో లేను.. ఐ యామ్ సింగిల్.. రెడీ టూ మింగిల్.
పవన్ తరపున ప్రచారం చేస్తారా..?
తెరపై పవన్ స్టైల్, యాక్షన్‌కి ఆయనికి అభిమానిగా మారిపోయా.. రాజకీయాలంటే నాకు ఏం తెలియదు.. కల్యాణ్ ఒక మంచి ఉద్దేశ్యంతోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కచ్చితంగా సమాజానికి మంచి చేస్తారు.. మార్పు తీసుకొస్తారని నమ్ముతున్నా. జనసేన తరపున ప్రచారం చేయాల్సిందిగా కల్యాణ్ గారు పిలిస్తే.. కచ్చితంగా వెళ్తా.