ఈ ఏడాది ఐపీఎల్ ప్రసారాలకు తెలుగులో కామెంటరీ వినిపించనుందని తెలిసిందే కదా..? తెలుగు ప్రసారాలకు జూనియర్ ఎన్టీఆర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది స్టార్ ఇండియా. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎన్టీఆర్ పాల్గొని మాట్లాడారు. దేశంలో క్రీడలు అంటే ఎంత ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ముఖ్యంగా క్రికెట్ మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. క్రికెట్ అంటే మక్కువ మనకు వారసత్వంగా వస్తుందని నా నమ్మకం. ఎందుకంటే మా నాన్నగారు క్రికెట్‌ను ఎంతో ఇష్టంగా చూసేవారు.. ఆయనను చూసి నేను కూడా క్రికెట్ పట్ల ప్రేమను పెంచుకున్నా.. ఇప్పుడు మా అబ్బాయికి కూడా క్రికెట్ పట్ల ప్రేమను పంచుతా. దేశంలో ఎన్నో భాషలు ఉన్నప్పటికీ..ఒకరికొకరు అర్ధమయ్యేలా మాట్లాడుకునేది కేవలం క్రీడల ద్వారానే. జాతీయ సమగ్రతను ఇవి చాటి చెబుతాయి. కేవలం భారతదేశంలోనే ఈ విధంగా మనం క్రికెట్‌ను ఆస్వాదిస్తాం. అయితే ఐపీఎల్ ఒక కొత్త కోణాన్ని సృష్టించింది. అలాంటి ఒక కొత్త కోణానికి మన తెలుగు భాషలో కామెంటరీ చేయడం, నన్ను దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నుకున్నందుకు స్టార్ ఇండియా వారికి ధన్యవాదాలు అంటూ మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అవేంటో మీరు ఓ లుక్కేయండి.
ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్ మిమ్మల్ని సంప్రదించినప్పుడు ఎలా ఫీలయ్యారు..?
స్టార్ వాళ్లు నన్ను సంప్రదించగానే చాలా సంతోషంగా అనిపించింది. ఓ నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ ఆలోచించలేదు.. మనకు మరింత దగ్గరవుతుందనే సరికి సెకండ్ థాట్ లేకుండా ఓకే చెప్పేశా.
క్రికెట్ అంటే ఇష్టమేనా..?
చిన్నప్పటి నుంచి క్రికెట్ చూడటం, ఆడటం రెండూ ఇష్టమే.. కాలేజ్ డేస్‌లోనూ.. హీరో అయిన కొత్తల్లోనూ క్రికెట్ బాగా ఆడేవాడిని. కానీ, ఇప్పుడు చూడటమే నాకు ఇష్టం.
మీ ఫేవరేట్ క్రికెటర్..?
ఇండియాలో చాలా మంది గొప్ప క్రికెటర్లు ఉన్నారు. అయితే నేను క్రికెట్ చూసే వయసులో నాకు తెలిసిన క్రికెటర్ సచిన్ ఒక్కరే...కాబట్టి ఆయనే నా ఫేవరేట్ స్టార్.
క్రికెట్ అంటే ఇష్టం అంటున్నారు.. క్రికెటర్ల బయోపిక్‌లో నటిస్తారా..?
ధోని బయోపిక్ చాలా బాగా తీశారు. కానీ నాకు బయోపిక్‌లలో నటించాలంటే భయం.. నేను కేవలం ఒక నటుడిని మాత్రమే.. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఓ హీరో పాత్రలో నేను నటించాల్సి వస్తే అనుమానమే. నాకు అంత ధైర్యం లేదు.
మీరు సినిమాల్లో సిక్స్ కొట్టానని అనిపించిన చిత్రమేది..?
సింహాద్రి.. ఆ తర్వాత చాలా సిక్స్‌లు కొట్టా.. అదే సమయంలో డకౌట్లు కూడా అయ్యా.. హిట్లు, ఫ్లాపులు అనేవి ఎమోషన్స్ పరంగా ఒక పూట, ఒక రోజు ఉంటాయి. చీకటిని చూసినప్పుడే వెలుతురు విలువ తెలుస్తుంది. అమాంతం పాతాళంలోకి వెళ్లిపోయిన తర్వాత పైకి రావడానికి కొంత సమయం పట్టవచ్చు.
మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నారు..?
నేను హీరో అవ్వాలని మా అమ్మానాన్న ఎవరూ కోరుకోలేదు. నేను మంచి డ్యాన్సర్ కావాలని మా అమ్మ కోరుకుంది.. నేను గొప్పగా చదువుకోవాలని మా నాన్న అనుకున్నారు. కానీ విధి నన్ను హీరోని చేసింది.
మీ అబ్బాయిని క్రికెటర్ని చేస్తారా..? హీరోని చేస్తారా..?
నా కుమారుడి భవిష్యత్తును నిర్ణయించడానికి నేనెవర్ని.. మన ఇష్టాయిష్టాలను పిల్లలపై రుద్దకూడదు. ఒక మంచి పౌరుడిగా మాత్రమే అతన్ని తీర్చిదిద్దుతా.. పిల్లలను వారి భవిష్యత్తును వారినే నిర్ణయించుకోనియండి.
క్రికెట్ తర్వాత మీకు ఇష్టమైన ఆట..?
నేను స్వతహాగా ప్రొఫెషనల్ బ్మాడ్మింటన్ ప్లేయర్‌ని.. నాకు చాలా ఇష్టం.. అయితే ఇప్పుడు ఆటలపై దృష్టి పెట్టేంత సమయం నాకు లేదు. క్రీడలకు సంబందించి క్రికెట్.. సాకర్.. రగ్బీ ఈ మూడు అంటే నాకు చాలా ఇష్టం.
ఐపీఎల్లో ఏ జట్టును సపోర్ట్ చేస్తారు..?
నేను హైదరాబాదీని కాబట్టి.. నా సపోర్ట్ హైదరాబాద్ సన్ రైజర్స్‌కే.
రాజమౌళి మల్టీస్టారర్ గురించి చెప్పండి..?
నేను, చరణ్ కలిసి చేయబోతున్న మల్టీస్టారర్‌కు సంబంధించి రాజమౌళి ఇంకా కథ పూర్తిగా చెప్పలేదు. మమ్మల్ని మాత్రం రెడీ అవ్వమని అన్నారు. ఆయన ఏ సందర్భంలోనైనా ఇద్దరిని పిలిచి కథ చెప్పినా మేము ఒకే అంటాం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్ని రాజమౌళి వెల్లడిస్తారు. ఇద్దరు స్టార్ హీరోల సినిమా కాబట్టి తప్పకుండా పోటీ ఉంటుంది. రాజమౌళి ఉన్నారు కాబట్టి త్రీవే కాంభినేషన్ ఉంటుంది.. కానీ అది చాలా ఫ్రెండ్లీగా ఉంటుందనిపిస్తుంది.
ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తారా..?
నాకు ఇంకా పిలుపు రాలేదు.. అవకాశం వచ్చిన రోజున మీకు చెప్పి నిర్ణయం తీసుకుంటా..
ఐపీఎల్ ఎవరితో కలిసి చూస్తారు..?
చాలామంది స్నేహితులు ఉన్నారు.. మీ అందరికి తెలిసిన వ్యక్తి అంటే రాజీవ్ కనకాల.