కోలీవుడ్ టాప్ హీరోగా విజయ్ కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. అలాంటి విజయ్ సినిమా ఫస్ట్ లుక్ వస్తోందంటే అభిమానులకు సంబరమే. ఆ ఆనందం రెట్టింపు చేస్తూ విజయ్ బర్త్ డే కానుకగా రిలీజైన న్యూ మూవీ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ను ఫుల్ గా ఫిదా చేసేసింది. 'సర్కార్' వంటి పవర్ ఫుల్ టైటిల్ ను ఈ సినిమాకు ఖరారు చేయడం ఇందుకు ఓ కారణమైతే.. ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ మాస్ లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తుండటం మరో కారణం. కానీ మరోవైపు ఈ పోస్టర్ పై అప్పుడే విమర్శలు కూడా మొదలయ్యాయి.
స్టార్ హీరోల సినిమాలకు యాంటీ ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడం కామనే. అయితే.. ఇక్కడ విజయ్ 'సర్కార్' ఫస్ట్ లుక్ ను విమర్శించిన ఓ పొలిటీషియన్ కావడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ఎంపీ, మాజీ ఆరోగ్యశాఖమంత్రి అన్బుమని రామదాస్ స్పందిస్తూ.. ఈ పోస్టర్ ద్వారా సిగరేట్ ను ప్రచారం చేస్తున్నావా.. ఇలా చేయడం సిగ్గుచేటు అంటూ విజయ్ పై విమర్శలు గుప్పించారు.
తాను సినిమాల్లో సిగరెట్ తాగే సన్నివేశాల్లో నటించనని గతంలో విజయ్ చెప్పాడు. ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ.. గతంలో చెప్పిందేమిటి ఇప్పుడు చేస్తుందేమిటి అంటూ ఎద్దేవా చేశారు ఎంపీ గారు. అంతేకాదు.. గతంలో స్మోకింగ్ గురించి విజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ ను పేపర్ కటింగ్ తో సహా పోస్ట్ చేశారు. విజయ్ ఇచ్చిన మాట తప్పాడనే విషయాన్ని పెద్దగా పట్టించుకోని అభిమానులు.. తమ అభిమాన హీరోపై కామెంట్ చేశాడని ఆ మాజీ మంత్రిపై మండిపడుతున్నారు. మరి ఈ రచ్చపై విజయ్ స్పందన ఎలా ఉండనుందో..!