ఉద్యోగం లేనోళ్ళు ఏమి చేస్తారు తమ తమ సీవీలు పట్టుకుని అన్ని కంపెనీల చుట్టూ తురుగుతారు. లేదా తనకు తెలిసిన వారి ద్వారా ఏమైనా వర్కౌట్ అవుతుందేమో అన్న ప్రయత్నాలు చేస్తారు కానీ ఈ టెకీ మాత్రం వినూత్నంగా ట్రై చేసి ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారడమే కాక సుమారు 200 జాబ్ ఆఫర్లు పట్టేశాడు. వివరాల్లోకి వెళ్తే వెబ్ డెవలపర్ డేవిడ్ కసారెజ్కు ఉండేందుకు ఇల్లు లేదు. చేసేందుకు పనిలేదు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించి విఫలమైన డేవిడ్ ఈనెల 27న ఉదయం మౌంటైన్ వ్యూలోని పెర్క్ బెంచ్ వీధుల్లోకి నీట్‌గా తయారై వచ్చాడు. ఐరన్ షర్ట్ టక్ చేసి టై కట్టుకుని రోడ్డుపై నిల్చుకున్నాడు. చేతిలో పెద్ద బ్యాగ్. అందులో ముందే చేసి పెట్టుకున్న సీవీలు ఉన్నాయి. ఓ కార్డుబోర్డు పై ‘హోంలెస్, హంగ్రీ ఫర్ సక్సెస్. టేక్ ఏ రెజ్యూమ్’ అని రాసిపెట్టుకుని నిల్చున్నాడు.
రెండు గంటలపాటు అలాగే కూర్చుని సీవీలు పంచిపెట్టడం మొదలుపెట్టాడు. అంతలో కారులో వచ్చిన జాస్మిన్ స్కఫీల్డ్ అనే యువతి అతడిని చూసి ఆగింది. దగ్గరికొచ్చి అడిగి ఫొటో తీసుకుంది. ఆ వెంటనే దానిని ఆన్లైన్లో పోస్టు చేసింది. అంతే, క్షణాల్లోనే అది వైరల్ అయింది. ఉద్యోగం కోసం అతడు పడుతున్నపాట్లు ఎన్నో సంస్థలను కదలించాయి. 26 ఏళ్ల డేవిడ్‌కు ఉద్యోగ ఆఫర్లు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. గూగుల్, నెట్క్లిక్స్, లింక్డ్ఇన్తోపాటు ఏకంగా 200 కంపెనీలు అతనికి ఉద్యోగం ఇస్తాయని ముందుకు వచ్చాయి. టెక్సాస్ యూనివర్శిటీలో మేనేజ్మెంట్ డిగ్రీ చేశాడు. 2014 నుంచి 2017 వరకూ జనరల్ మోటార్స్‌లో పనిచేశాడు. ఏదో కారణంతో అతనిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. దీంతో అతను ఉద్యోగ వేటలో పడ్డాడు. మొత్తానికి క్రియేటివిటీ ఉంటె ఎడారిలో ఇసుక కూడా అమ్మొచ్చన్న మాట.