మీరు గానీ మీ సంబంధీకులు గానీ రైలులో ఎక్కువ ప్రయాణిస్తున్నార ? అయితే మీకు ఒక ముఖ్యమైన సమాచారం. ఇకపై మీ వెంట తీసుకెళ్లే సామాన్ల (లగేజీ) బరువు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పటి వరకు ఒక లెక్క ఇకనుండి మరో లెక్క పరిమితికి మించి లగేజీని వెంట మోసుకెళ్తే.. జరిమానా మోతెక్కిపోక తప్పదు! ఈ మేరకు సామాన్ల బరువుకు సంబంధించిన నిబంధనలను పక్కాగా అమలు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఎందుకంటే ప్రయానికుల కంటే వారి లగేజీతోనే ఎక్కువగా బోగీలు నిండిపోతున్నాయని ఫలితంగా ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయని ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో రైల్వేవర్గాలు ఈ అంశంపై దృష్టిసారించాయి. సామాన్లకు సంబంధించి దాదాపు మూడు దశాబ్దాల క్రితమే రూపొందించుకున్న నిబంధనలను ఇకపై కఠినంగా అమలు చేయాలని నిర్ణయించాయి.
ఈ అంశం మీద లోక్సభలో ఓ సభ్యుడు అడిగి ప్రశ్నకు ఆ శాఖ సహాయ మంత్రి రాజన్ గొహెయిన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ నిబంధనల ప్రకారం పరిమితికి మించిన బరువులను వెంట తీసుకెళ్లే ప్రయాణికులకు సదరు లగేజీ టికెట్ ధరకు ఆరు రెట్ల మొత్తాన్ని జరిమానాగా విధిస్తారు. వారి లెక్కల ప్రకారం ప్రస్తుతం స్లీపర్ క్లాస్ అయితే 40 కిలోలు, సెకండ్ క్లాస్ అయితే 35 కిలోలు, ఫస్ట్/టైర్2 ఏసీలో 50 కిలోలు, ఫస్ట్ ఏసీలో 70 కిలోల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే, గరిష్ఠ పరిమితి తర్వాత కూడా లగేజీ కి డబ్బులు టికెట్ కౌంటర్ లో కడితే రైల్వే ఈ కింద విధంగా అనుమతిస్తోంది దీని ప్రకారం సెకండ్ క్లాస్లో 70 కిలోలు, స్లీపర్ క్లాస్లో 80 కిలోలు, ఏసీ 3టైర్/ఏసీ చైర్ కార్లో 40 కిలోలు, ఫస్ట్ క్లాస్/ ఏసీ టైర్ 2లో 100 కిలోలు, ఫస్ట్ ఏసీలో 150 కిలోల దాకా గరిష్ఠంగా లగేజీని తీసుకెళ్లే సదుపాయం ఉందని, కానీ దీనిని నిర్దేశిత బోగీలో ఉంచాల్సి ఉంటుందని మంత్రి వెల్లడించారు.
రెండు నెలల కిందటే ఈ అంశంపై తెరపైకి రావడంతో ప్రయాణికుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెనక్కి తగ్గిన రైల్వే శాఖ అధిక లగేజీ తీసుకెళ్లే ప్రయాణికులపై జరిమానా విధించాలన్న నిబంధనను ఉపసంహరించుకుంది. సోషల్ మీడియా వేదికగా రైల్వే శాఖ నిర్ణయంపై నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. మరోవైపు ప్రతిపక్షాలు సైతం తీవ్రంగా విమర్శించడంతో వెనక్కి తగ్గిన రైల్వే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు తెలిపింది. ప్రయాణికులకు అవగాహన కల్పించడం కోసమే ఆ నిర్ణయం తీసుకున్నాం తప్పితే, వారిని ఇబ్బంది పెట్టాలని కాదని పేర్కొంది. తాజాగా లోక్సభలో రైల్వే శాఖ సహాయ మంత్రి దీనిపై ప్రకటన చేయడంతో విషయం మళ్ళీ వార్తల్లోకి వచ్చింది.