మాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్‌లాల్ బీజేపీలో చేరనున్నట్లు దేశవ్యాప్తంగా ఊహాగానాలు చెలరేగాయి. అందుకనే నిన్న సోమవారం కృష్ణాష్టమి రోజున ప్రధాని నరేంద్రమోడీతో డైరెక్ట్ గా మోహన్‌లాల్ సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మోహన్ లాల్ విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా తాను చేస్తున్న సామాజిక కార్యక్రమాలను ప్రధానికి వివరించినట్లు సమాచారం అందుతుందిగానీ... విషయం మాత్రం బీజేపీలో మోహన్ లాల్ చేరి కేరళ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు అంతర్గతంగా నడుస్తున్న చర్చ.
కాగా మోడీని కలిసిన తర్వాత మోహన్ లాల్ మాట్లాడుతూ గ్లోబల్ మలయాళీ రౌండ్ టేబుల్ కార్యక్రమానికి ప్రధాని తన సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పినట్లు తెలిపారు. నూతన కేరళను ఆవిష్కరించుకోవడానికి ఇది ఎంతో దోహదం చేస్తుందని కూడా ఆయన పేర్కొన్నట్లు వెల్లడించారు. అలాగే.. వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని భరోసా ఇచ్చినట్లు కూడా మోడీ మాటగా మోహన్‌లాల్ చెప్పారు. ప్రధాని మోడీ కూడా మంగళవారం ట్విటర్లో మోహన్‌లాల్‌ను ప్రస్తావిస్తూ.. ఆయన వినయం ఎంతో ఆకర్షించిందని తెలిపారు. మోహన్‌లాల్ చేపట్టే సామాజిక కార్యక్రమాలు ప్రశంసనీయమైనవని.. అవి ఎంతో మందిని ప్రభావితం చేస్తాయని కొనియాడారు. మోహన్‌లాల్‌తో కలిసిన ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేశారు.
అంతేకాకుండా గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతే సేవ అనే కార్యక్రమంలో ప్రధాని మోడీ, మోహన్‌లాల్ ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. మోహన్‌లాల్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల లక్షలాది మంది ప్రభావితులవుతారని ఆయన కీర్తించారు. అయితే ఈ మోహన్ లాల్ బీజేపీలో చేరే విషయంపై బీజేపీ నేతలు పలు రకాలుగా వెల్లడిస్తున్నప్పటికీ ఎన్నికల నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ.. ఇప్పుడు కాంగ్రెస్ నేత శశిథరూర్ ఎంపీగా ఉన్న తిరువనంతపురం నుంచి మోహన్‌లాల్ బీజేపీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు మాత్రం తెగ షికార్లు కొడుతున్నాయి.