ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తల పెట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లాలో కొనసాగుతుంది. వైఎస్ జగన్ నిన్న విశాఖ నగరంలో అడుగుపెట్టారు. నిన్న పెందుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరం నుంచి జగన్ 257వ రోజు(నిన్నటి) పాదయాత్రను ప్రారంభించారు. జెర్రిపోతులపాలెం, పెదనరవ మీదుగా కోటనరవకు చేరుకున్న జగన్ అక్కడ భోజన విరామం తీసుకున్నారు. తిరిగి యాత్రను ప్రారంభించిన జగన్ కొత్తపాలెం మీదగా గోపాలపట్నం వరకు పాదయాత్ర చేసి విశాఖ నగర పరిధిలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా 1991 బ్యాచ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు చెందిన 30మంది పూర్వ విద్యార్థులు వైఎస్ జగన్కు స్వాగతం పలకడానికి వచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంఘీభావం తెలడపడానికి ఆయన స్కూల్ మిత్రులు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు క్లాస్ లీడర్ గా ఉండి రికార్డు సృష్టించారని వారు పేర్కొన్నారు. అప్పట్లో జగన్ రెడ్ హౌజ్ కెప్టెన్ గా వ్యవహరించారని, ఆల్ రౌండర్ షీల్డ్ లు కూడా అందుకున్నారని గుర్తుచేసుకున్నారు. పాఠశాలలో కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్ అందరికీ అండగా ఉండేవారని పేర్కొన్నారు. ఇప్పుడు జగన్ ఫాలోయింగ్ చూస్తే ఆశ్చర్యమేసిందని, అటువంటి వ్యక్తి తమకు స్నేహితుడు కావడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. జగన్ ను సీఎంగా చూడాలనుకుంటున్నామని, ఆయనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.