అదే జరిగితే సైరాకి బ్రేక్ పడినట్లే?
September 15,2018 05:45 PM
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న `సైరా నరసింహారెడ్డి` షూటింగ్ జార్జియాలో శర వేగంగా జరుగుతోంది. 20 రోజుల పాటు నిరవధికంగా షూటింగ్ చేసి షెడ్యూల్ పూర్తిచేసి తిరిగిరానున్నారు. అనంతరం మళ్లీ యధావిధిగా హైదరాబాద్ ఆర్. ఎఫ్.సీలో షూటింగ్ చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. అయితే ఇప్పుడా లెక్క తప్పేలా ఉంది. అందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే కారణం కాబోతున్నాడని సమాచారం. వివరాల్లోకి వెళ్తే. నవంబర్ లో తెలంగాణ రాష్ర్టంలో ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఈసారి ఎలాగైనా తెలంగాణలో పట్టు సాధించాలని రాహుల్ కసి మీదున్నాడు. ఈనేపథ్యంలో పార్టీ ప్రచారంలో భాగంగా చిరంజీవిని రంగంలోకి దింపాలని చూస్తున్నారుట.
ప్రచార కమిటీలో చిరుకు కీలక బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నారుట. పార్టీ నాయకుల సూచన మేరకే రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. కర్ణాటక ఎన్నికల సమయంలోనే చిరును దింపాలని చూసారు. కానీ చిరు సైరా షూటింగ్ లో బిజీగా ఉండటంతో వీలు పడదని రిక్వెస్ట్ చేయడంతో రాహుల్ లైట్ తీసుకున్నారుట. కానీ ఈసారి జరిగే ఎన్నికలు తెలుగు రాష్ర్టానికి సంబంధించినవి కావడంతో చిరు ను ఒప్పించి బరిలోకి దించాలని చూస్తున్నారుట. చిరు జార్జీయా నుంచి రాగానే రాహుల్ కలిసే అవకాశం ఉందని పార్టీ శ్రేణుల నుంచి తెలిసింది. చిరు గనుక ప్రచార బరిలోకి దిగితే సైరా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోతుంది. దీంతో ప్లానింగ్ మొత్తం మారిపోతుంది. అనుకున్న టైమ్ లో సినిమా కూడా రిలీజ్ కాదని తెలుస్తోంది. మరి చిరు మనసులో ఏముందో?