తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ కూటమి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ముందు కేసీఆర్ తన అధికార బలంతో జగ్గారెడ్డిని జైల్లో పెట్టించిన విషయం తెలిసిందే. అయితే ఇది ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్నిది కాసేపు పక్కనబెడితే... అవకాశం దొరికిందే తడవుగా టీఆర్ఎస్ పై జగ్గారెడ్డి అనుయాయులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు కేసీఆర్ పై దుమ్మెత్తిపోస్తున్నారు.
తాజాగా ఈరోజు జగ్గారెడ్డి భార్య నిర్మలారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతలు దిగజారి మరీ.. చిల్లర రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. సదాశివపేట మండలం అరూరులో నిర్మల, ఆమె కుమార్తె జయ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. నిర్మలారెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు జగ్గారెడ్డి ఇక్కడ మన మధ్య లేకపోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని తెలిపారు. తాము ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే.. 'జగ్గారెడ్డిని జైల్లో ఎలా హింసించారో చెప్పేందుకే వచ్చాం. తాము రాజకీయాల కోసం రాలేదని... జగ్గారెడ్డి ఉంటే ఈరోజు మేము రోడ్డుమీదికి వచ్చే వాళ్లమా? చూడండి.. ఈరోజు నా కూతూరు కూడా రోడ్డు పైకి వచ్చింది' అని ఆమె వివరించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కేసీఆర్వి నీచమైన ఆలోచనలని.. ఆయన సీఎం కావడానికి కాంగ్రెస్సే కారణమని.. ప్రజలంతా కాంగ్రెస్కు ఓటేసి జగ్గారెడ్డిని గెలిపించి.. టీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్పాలని నిర్మలారెడ్డి కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు.