కేరళ సీపీఎం ఎంపీ పీకే శ్రీమతి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఆలయాలకు వెళ్లేది భక్తితో కాదని, అంగాంగ ప్రదర్శనతో అక్కడున్న పురుషులను ఆకట్టుకోవడానికే వారు ఆలయానికి వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలను అలా చూసి ఆనందించడానికే పురుషులు కూడా ఆలయానికి వెళ్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఆలయాల్లోని కోనేరులో స్నానం చేసే మహిళలు తడిసిన దుస్తులతో అంగాంగ ప్రదర్శనకే మొగ్గు చూపుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శబరిమల పుణ్యక్షేత్రంలో మహిళలకు ప్రవేశం కల్పిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో సంఘ్ పరివార్ లాంటి హిందూ సంస్థలు ఈ తీర్పును తప్పుబడుతుంటే లెఫ్ట్ పార్టీల నేతలు మాత్రం స్వాగతిస్తున్నారు. ఈ నేపధ్యంలో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అడ్డంపెట్టుకుని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై తిరుగుబాటుకు ఆరెస్సెస్, కాంగ్రెస్, బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని శ్రీమతి ఆరోపించారు. సుప్రీం తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సమానత్వ హక్కును ఎవరూ కాదనలేరని పేర్కొన్నారు. కేరళలోని అనేక సామాజిక దురాచారాలను కమ్యూనిస్టు పార్టీ రూపుమాపిందని శ్రీమతి అన్నారు. ఎంపీ వ్యాఖ్యలపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలను ఇంత ఘోరంగా అవమానించడమేంటంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తక్షణం ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.