కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. బయటకు నియోజకవర్గ అభివృద్ధి కోసమే అని చెబుతున్నా ఒంటేరు టీఆర్ఎస్ లో చేరడానికి గల కారణాలు వేరే ఉన్నాయని చెబుతున్నారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరికపై కాంగ్రెస్ ఎమ్మేల్యే జగ్గారెడ్డి ఈ విషయాలనుబయత పెట్టారు. వ్యక్తిగత కారణాలతోనే ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ ఎస్ లోకి వెళ్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. ఒంటేరు ఆర్థికంగా చితికిపోయారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పై పోరాటంలో ఒంటేరుపై అనేక కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ప్రతాప్ రెడ్డి నాయకుడిగా బలహీనుడు కాడని పరిస్థితులు ఆయన్ను బలహీనుడిగా మార్చాయని చెప్పారు. ప్రతాప్ రెడ్డి పార్టీ మారడాన్ని వ్యక్తిగతంగా తాను తప్పుపట్టనని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని ప్రతీ బలహీనుడు టీఆర్ఎస్ కు ఆకర్షితుడేనని తెలిపారు. తాను మాత్ర బతికినంత కాలం కాంగ్రెస్ లోనే ఉంటానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ తో కొట్లాడే అవసరం తనకు లేదన్నారు. పార్టీ వేరు, రాజకీయం వేరు, అభివృద్ధి వేరని పేర్కొన్నారు. తన అవసరం వారికి లేదు కానీ వారి అవసరం తనకు ఉందన్నారు. అంతేకాక తెలంగాణలో కష్టపడే కాంగ్రెస్ నాయకులకు ఏమాత్రం గుర్తింపు లేదని, ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసే వారికే ప్రాధాన్యత ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కష్టపడే నాయకులను కాంగ్రెస్ పార్టీ గుర్తించాలని, ఢిల్లీలో లాబీయింగ్ సిస్టమ్ కు పుల్ స్టాఫ్ పెట్టాలని అభిప్రాయపడ్డారు.