గత రెండు ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రత్యర్ధి, గజ్వేల్ కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి ఈరోజు టీఆర్ఎస్లో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం మీద ఆయన నుండి ఎటువంటి ఖండన లేకపోవడంతో ఇదంతా నిజమేనని అంతా భావించారు, కానీ అందరినీ షాక్ కి గురి చేసేలా ఈ వార్తలపై టీఆర్ఎస్ నేత, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. వంటేరు పార్టీలోకి వస్తానంటే తీసుకునేవారు ఎవరూ లేరని ఆయన స్పష్టంగా చెప్పారు. ప్రతాప్ రెడ్డి కావాలనే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పార్టీలో చేరాలంటూ ఆయనను ఎవరూ సంప్రదించలేదని, ఆయన కావాలనే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ఆయన పార్టీలో చేరతాననంటే ముందు మేము తీసుకోవాలి కదా అని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. తాజాగా తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై గజ్వేల్ లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో కూడా ఆయన టీడీపీ తరపున కేసీఆర్ పైనే పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా, ఆయన టీఆర్ఎస్లో చేరబోతున్నట్టు గురువారం సాయంత్రం ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. నేటి సాయంత్రం కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీని మీద వంటేరు స్పందిన్చాకపోగా మెదక్ ఎంపీ మాత్రం దీనిని తోసిపుచ్చారు. దీంతో ఆయన టీఆర్ఎస్ లో చేరేందుకు ఇలా ప్రకటనలు ఇస్తున్నారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకప్పుడు పోలీసు కేసులు పెట్టి తీవ్రంగా వేధించిన సమయంలో కూడా నిలబడ్డ ఆయన ఈరోజు టీఆర్ఎస్ గూటికి ఎందుకు వెళుతున్నారు అనేది మిస్టరీగా ఉందని కొందరు టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏమో మరి ? లోగుట్టు పెరుమాళ్ళ కెరుక.