తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్న మహా రుద్రసహిత సహస్ర చండీ యాగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటినుంచి ఐదు రోజుల పాటు జరిగే ఈ చండీయాగానికి సంబంధించిన ఏర్పాట్లను శారదాపీఠం వేద బ్రహ్మణులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. శృంగేరి పీఠాధిపతులు ఆశీస్సులతో వారి శిష్య బృందం ఆధ్వర్యంలో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో దక్షిణ ద్వారాన్ని అనుకొని యాగశాలను నిర్మించారు.
కాగా ఇక్కడ నిర్వహించనున్న మూడు యాగశాలలతో పాటు 27 హోమగుండాలు ఏర్పాటు చేశారు. గతంలో కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో అయుత చండీయాగం, ఎన్నికల ముందు రాజశ్యామల యాగం నిర్వహించారు. ఇప్పటికే కర్ణాటకకు చెందిన శృంగేరి పీఠం నుంచి సుమారు 200 మంది రుత్వికులు ఎర్రవల్లి చేరుకున్నారు. అదేవిధంగా రేపటి నుంచి జరగనున్న మహారుద్ర సహిత సహస్ర చండీయాగానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్ లకు ఆహ్వానం పంపించారు. సామాన్య ప్రజలను భద్రతా కారణాల దృష్ట్యా ఈ సారి అనుమతించడం లేదు. కార్యక్రమం నిర్వహించే రుత్వికులకు, అతిథులకు నివాస యోగ్యమైన ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పీఠాలకు చెందిన అదిపతులు, ధార్మికవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.