అక్రమ ఆస్తుల కేసులో బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడౌతుంది. సామాజికవేత్త ఎన్.మూర్తి సమాచార హక్కు చట్టం కింద వేసిన దరఖాస్తు ద్వారా జైలులో శశికళ అనుభవిస్తున్న వసతుల వివరాలు బట్టబైలయ్యాయి. ఆమెకు వీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్నారని.. జైలు అధికారులు శశికళ విషయంలో తప్పుడు ప్రచారం చేశారని మూర్తి ఆరోపించారు.
అయితే 'శశికళకు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించారన్నది నిజం. ఆమెకు మొదట్లో ఒక్క గది మాత్రమే కేటాయించారు. కానీ.. ఆమె పక్కన ఉన్న నాలుగు గదుల్లో 2017 ఫిబ్రవరి 14 వరకు మహిళా ఖైదీలున్నారు. శశికళను జైలుకు తరలించిన తర్వాత వారిని వేరే చోటుకు పంపి.. ఐదు గదులను ఆమెకే కేటాయించారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీని శశికళ కోసం వంట చేయడానికి కూడా అధికారులు కేటాయించారు. నిబంధనల్నిఉల్లంఘించి.. శశికళను చూడటానికి గుంపులు గుంపులుగా ప్రజలను అనుమతిస్తున్నారు. నేరుగా ఆమె గదికి వెళ్తున్నారు. 3 నుంచి 4 గంటలపాటు ఉంటున్నారు' అని మూర్తి మీడియాకు వివరించారు. కాగా శశికళను సాధారణ ఖైదీలా పరిగణించడం లేదని.. ఆమెకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారని 2017 జులై 13లోనే జైలు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డి. రూప ఆరోపించిన విషయం తెలిసిందే. ఇవే వసతుల కోసం జైలు అధికారులకు ఆమె రూ.2 కోట్లు లంచం ఇచ్చైరని ఆమె చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం కూడా రేగింది.