యూపీని మినీ భారత్ గా చెబుతారు అందుకే, అక్కడ గెలిచిన ఎంపీలకి దేశంలో ప్రధానిని ఎన్నుకునే అవకాశం ఎక్కువ. ఈసారి ఎలా అయినా గెలవాలని యూపీలో ఎస్పీ, బీఎస్పీ జట్టుకట్టడంతో, కాంగ్రెస్‌కు ఒంటరిపోరు తప్పలేదు. వీలైనన్ని సీట్లు సాధించి బీజేపీకి నష్టం కలిగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ప్రియాంకను రంగంలోకి దింపింది. ప్రియాంకకు కీలక బాధ్యతలు అప్పగించడంతో, యూపీ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. మరోసారి యూపీ మీదే ఆశలు పెట్టుకున్న మోడీకి సవాల్ విసిరినట్టయ్యింది. కేంద్రంలో మోడీ పాలన, రాష్ట్రంలో యోగి పాలన మీద నానమ్మ ఇందిరా పోలికలున్న ప్రియాంకతో విమర్శలు చేయిస్తే, జనంలోకి బలమైన ముద్ర వేయొచ్చన్నది కాంగ్రెస్ భావన. నడకలో, రూపంలో అచ్చు ఇందిరను తలపించే ప్రియాంక పట్ల జనంలో అభిమానముంది. గత ఎన్నికల్లోనూ రాయ్‌బరేలీ, అమేథిలో, తల్లి, అన్నలకు ప్రచారానికి వెళ్లిన ప్రియాంకకు జనం బ్రహ్మరథం పట్టారు. దానినే ఇప్పుడు తనకి అనుకూలంగా వాడుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఇచ్చిన పదవిని చూసినప్పటి నుంచి కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ తిరిగి గాడిలో పడడానికి ఆమె చరిష్మా ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. ఇందిర కుటుంబ ఆల్బం నుంచి తీసి మరీ దీనిని షేర్ చేశారు. నానమ్మ ఇందిరా గాంధీతో ప్రియాంక ‘ఒప్పుల కుప్ప’ ఆట ఆడుతున్న ఫొటో అది. ప్రియాంక గాంధీలో ఇందిరను చూపించే ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈ ఫొటోను కాంగ్రెస్ పోస్టు చేసింది. ‘శక్తి సంపన్నులైన మహిళలు శక్తిసంపన్నులనే ప్రోత్సహిస్తారు’ అని ఈ ఫొటోకు క్యాప్షన్ తగిలించింది. ‘నానమ్మ లానే మనవరాలు కూడా’, ‘కుటుంబం-ప్రేమ-మహిళా సాధికారత’ అన్న ట్యాగ్ లైన్లు కూడా ఈ ఫొటోకు తగిలించింది. రాజీవ్ మరణం తర్వాత ప్రియాంక రాజకీయాల్లోకి రాలేదు రాబర్ట్ అనే ఓ వ్యక్తిని ప్రేమ పెళ్లి చెసుకుని ఇంటికి పరిమితమైపోయింది. అయిది పార్టీ ఎన్నికల ప్రచారం, పార్టీ సంబంధిత సమావేశాలకు ప్రియాంక సాధారణంగా నూలు దుస్తులే ధరిస్తారు. దాన్నే చూపిస్తూ ఇప్పుడు ఆమెను ఇందిరా గాంధీ ప్రతిరూపం అంటూ ప్రోమోట్ చేయడమే పనిగా పెట్టుకుంది కాంగ్రెస్, దానికీ కారణం లేకపోలేదు. యూపీలో యాదవులు, దళితుల ఓట్లు ఎస్పీ, బీఎస్పీలకే వెళతాయి.
ఇక మిగిలిన ఓట్లు ముస్లింలు, అగ్రవర్ణాలు. ముస్లింలలో కొందరు ఎస్పీ, బీఎస్పీకి మళ్లితే, మిగతావారి ఓట్లు కాంగ్రెస్ వే. ముస్లిం వోట్లు ఎటూ ముగ్గోరూ పంచుకోవాలి. ఇక మిగిలిన అగ్రవర్ణాల ఓట్ల మీదే బీజేపీ ఆశలు పెట్ట్కుంది. అందుకే వీటినే చీల్చాలన్నదే కాంగ్రెస్ వ్యూహం. అందుకే అగ్రవర్ణాలను ఆకర్షించేందుకు, ప్రియాంకను అస్త్రంగా రాహుల్ ప్రయోగించారు. ముందు నుంచి యూపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా, బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాలే. కానీ మొన్నటి ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడంతో, వారంతా బీజేపీ వైపు మళ్లారు. ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీలతో కాకుండా, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుండటంతో, అగ్రవర్ణాల ఓట్లు చీలతాయని బీజేపీ భావన. దానికోసం పదిశాతం రిజర్వేషన్ ని ఆయుదహంగా వాడుకున్నా దాన్ని కూడా తిప్పికొట్టడానికి రాహుల్ సిద్దమయ్యారు. బీజేపీ లాగానే హిందు కార్డుతోనే బీజేపీ హవాను నిలువరించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఫిబ్రవరిలో కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించి దానికి విస్తృత ప్రచారం కల్పించడం మంచి అవకాశంగా భావిస్తున్నారట. దానికి అవసరమైన సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. లక్షలాది మంది వీక్షిస్తుండగా పుణ్యస్నానం ఆచరించడం ద్వారా హిందూ మూలాలను బలంగా ప్రజల్లోకి పంపవచ్చునని రాహుల్ భావిస్తున్నారు. ఇందుకోసం జంద్యం, పసుపు పంచె, కండువా ధరించి గంగా జలాల్లో పుణ్యస్నానమాచరిస్తారని పార్టీ వర్గాల సమాచారం. రాహుల్ స్నానం చేస్తుండగా 12 మంది పండితులు వేద మంత్రాలను జపిస్తారని తెలిపారు. ఇలా ఒక పక్క ప్రియాంక మరోపక్క రాహుల్ రంగం లోకి దిగి యూపీ వోట్లను కొల్లగొట్టాలనేది కాంగ్రెస్ యోచనగా తెలుస్తోంది. అలాగే ప్రియాంకకి యూపీ బాధ్యతలు అప్పగించడంతో, కుటుంబ పార్టీ అని మోడీ కూడా విమర్శలు మొదలుపెట్టారు. ఆమె భర్త రాబర్ట్ వాద్రా అవినీతి మీద చాలా ఆరోపణలు చేస్తోంది బీజేపీ.