కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవి వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారా? తన తమ్ముడు పవన్ కళ్యాణ్ సొంత పార్టీ జనసేనతో వామపక్షాలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగితునప్పటికీ చిరంజీవి కాంగ్రెస్ తరఫున ప్రచార బరిలో, అలాగే ఎమ్మెల్యే రేసులో నిలవనున్నారా? అంటే అవుననే అంటున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. రానున్న ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సినీనటుడు చిరంజీవి ప్రచారం చేస్తారని, ఆ పార్టీ నాయకుడు రఘువీరారెడ్డి తెలిపారు. అంతే కాకుండా ఎన్నికలకు సంబందించిన కాంగ్రెస్ తరపున అన్ని పనులని చిరంజీవి చూసుకుంటారని రఘువీరారెడ్డి నిన్న ప్రకటించారు. ప్రస్తుతానికి చిరంజీవి సినిమా షూటింగ్ లలో బిజీగా ఉండటం వలన ఆయన తెలంగాణా ప్రచారాలకు రాలేకపోయారని, షూటింగ్ అయిపోయాక ఆయనే వస్తున్నట్లు సమాచారం అందించారని రఘువీరారెడ్డి అన్నారు. అంతే కాక కాంగ్రెస్‌తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొత్తు కోసం ప్రయత్నిస్తుందన్న వ్యాఖ్యలపై రఘువీరా గట్టిగా స్పందించారు. వైసిపీ లాంటి బ్రోకర్ పార్టీల మద్దతు కాంగ్రెస్ పార్టీ కి అవసరం లేదని ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదని రుఘువీరారెడ్డి స్పష్టం చేశారు.
ప్రియాంక రాకతో మళ్ళీ ఇందిరమ్మ వచ్చినట్లుగా అనిపిస్తుందని, ఈసారి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కునే దమ్ము ఎవరికి లేదని ఆయన అన్నారు. అలాగే దమ్ముంటే ఏపీలో కెసిఆర్ తో కలిసి జగన్ పోటీ చేయాలని రఘువీరారెడ్డి సవాల్ విసిరారు. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే రఘువీరా రెడ్డి చెప్పినట్టుగా కాంగ్రెస్ తరఫున చిరంజీవి ప్రచారానికి రాగలరా అంటే అనుమానమే ! ఎందుకంటే, మెగాస్టార్ అభిమానులు జనసేనలోకి పెద్ద ఎత్తున చేరారు. చిరంజీవి ఫ్యాన్స్ రాజకీయంగా పవన్ కల్యాణ్ కి మద్దతుగా ఉంటారనే సంకేతాలు ఇచ్చారు. అలాగే పవన్ కల్యాణ్ కూడా తన అన్న ఉన్నాడని కూడా చూడకుండా కాంగ్రెస్ మీద కూడా ఇతర పార్టీలలాగానే తీవ్రస్థాయి విమర్శలు చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు.. ఎన్నికలకు రెండు నెలల ముందు వచ్చి, కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తారని ఎలా మాటివ్వగలరు..? పవన్ కల్యాణ్ కి జనసేనకి అంత సీన్ లేదని ! ఆయనకు ప్రజా సమస్యల మీద క్లారిటీ లేదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటే దాన్ని ఏకీభవిస్తూ చిరంజీవి మాట్లాడగలరా ? అదీ కాక ఇప్పుడు నాగబాబు, రామ్ చరణ్ తేజ, వరుణ్ తేజ వంటి వారు పవన్ కళ్యాన్ కే తమ మద్దతు అని ప్రకటించారు. ఈ నేపధ్యంలో చిరంజీవి కాంగ్రెస్ తరపున పోటీ చేసి, ఒక వేళ పోటీ చేయకుండా ఎన్నికల ప్రచ్రానికి వస్తే ఈ ఫ్యామిలీ ఎవరి వైపు నిలబడుతుంది ?. ఒక వేళ గనుక చిరంజీవి ప్రచారం చేస్తే నేరుగా పవన్ కళ్యాణ్‌కు దెబ్బ తగులుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చెబుతున్నట్లుగా ప్రచారం అయితే చేయరని ఆయన ప్రచారానికి దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. నిజంగానే చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తే జనసేనకు పెద్ద దెబ్బే. ఎందుకంటే చిరంజీవి కుటుంబానికి చెందిన ఫ్యాన్స్ ఇప్పటికే జనసేన వైపు ఉన్నారు. చిరంజీవి కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తే అభిమానుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి, కాబట్టి చిరంజీవి మౌనంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. అలాగే చిరంజీవి ప్రచారం వలన ఓట్లు చీలి అసలే అనుభవ లేమితో కొట్టు మిట్టాడుతున్న జనసేనకు నష్టం జరుగుతుందని భావిస్తున్నారు.