రిపబ్లిక్ డే వచ్చేసింది. ఈరోజు ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక నార్మల్ హాలిడే. సరదాగా ఇంటి పట్టున గడుపుతూనో లేక ఏ సినిమాతోనో, షాపింగ్‌మాల్ లోనో కాలం గడిపేస్తారు ఈ తరం వారు. కానీ దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి, స్వరాజ్య సాధన కోసం ప్రాణాలు అర్పించిన ఎంతో మంది త్యాగధనులని ఈ రోజు ఎంత మంది ఎంతసేపు స్మరిస్తున్నారు, జాతీయ సెలవు దినాలలోనైనా ఎంత మంది వారి ఆదర్శాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటున్నారు. ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి చాక్లెట్ లు ఇచ్చి పంపించే విద్యాసంస్థలు కొన్నైతే, మేము అసలు ఇండియాలోనే లేమంటూ స్టడీ హవర్స్ పెట్టె వాళ్ళు మరికొందరు. మీకు ఇష్టమైన హీరో ఎవరు, మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు అని కాకునా అసలు దేశ స్వాతంత్ర్యం మీద, ఆ ఘట్టాల మీద నేటి యువతకి ఎంత అవగాహన ఉంది, అన్న విషయాల మీద ఎవరైనా సర్వే నిర్వహిస్తే ఎంత బావుణ్ణు. దేశం సిగ్గుపడే విషయాలు బయటికి వస్తాయి. 1950 జనవరి ఇరవయ్యారవ తేదినుంచి మనదేశ రాజ్యాంగం అమల్లోకికి వచ్చింది కాబట్టి ప్రతి ఏటా అదే తేదిన మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అనుకుంటారు కొంతమంది. ఇందులో కాస్త నిజం లేకపోలేదు.
అయితే అసలు కారణం వేరే ఉంది. భారత రాజ్యాంగానికి నవంబరు 26, 1949 లోనే ఆమోదం లభించింది. అమలు పరచే తారీఖుకి ఒక ప్రాముఖ్యత ఉండాలని రెండు నెలలు ఆగారు. ఏమిటా తారీఖు ? ఏమిటా ప్రాధాన్యత ? 1930 జనవరి 26వ తేదిన అప్పటి అవిభక్త పాకిస్తాన్ లోని లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో మొదటిసారిగా దేశానికి పూర్ణ స్వరాజ్యం కావాలని ప్రకటించారు. అప్పటి దాకా కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్రం లభిస్తే చాలు, సర్వోత్కృష్టమైన సంపూర్ణ అధికారం భ్రిటిషు వారి చెప్పు చేతుల్లోనే వుంచి సామంత రాజ్యంగా మిగిలిపోయినా ఫర్వాలేదనుకొనే భావనలో ఉన్న మన రాజకీయ నాయకులకి జలియన్ వాలా బాగ్ ఉదంతం జాతిని ఉలిక్కిపడేలా చేసింది. సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ వంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో కాక పుట్టించి పూర్ణ స్వరాజ్యమే లక్ష్యంగా ప్రకటన ఇప్పించగలిగారు. ఆ రోజునే స్వాతంత్రం దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు పిలుపు కూడా ఇచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవంబరు 26, 1949లోనే రాజ్యాంగానికి ఆమోదం లభించినా మరో రెండు నెలలు ఆగి జనవరి 26 1950 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. అటువంటి రిపబ్లిక్‌డే ప్రైవేటు పాఠశాలలకు నేడొక ఆటవిడుపులా మారింది. ప్రేమికులరోజుకి కూడా రకరకాల భాష్యాలు చెప్పి ఆరోజు పిల్లల చేత ఫాన్సు డ్రెస్ లు వేయించే స్కూల్స్ కి ఈ జ్ఞానం ఉంటుందని అనుకోవడం మన పిచ్చిదనం. అయినా గాంధీ నెహ్రూలు తప్ప మరో స్వాతంత్రం సమరయోధుడు తెలియని పిల్లలు నేడు పాటశాలల్లో ఉన్నారంటే అది ఈ స్కూల్ల చలవే. అదృష్టం ఏమిటంటే నా చిన్నతనంలో స్కూళ్ళో జరుపుకున్న జాతీయపండుగలు నాకింకా ఇప్పటికీ బాగా గుర్తుంటాయి. పాఠశాలంతా అప్పుడే తాయారు చేసిన మేరునగలా తీర్చిదిద్ది మూడు రంగుల పేపర్ తోరణాలతో, పిల్లలంతా తెల్లని వస్త్రాలలో ముద్దులోలికేలా, తెల్లటి చొక్కాకి ఎడమ వైపు గుండుసూదితో గుచ్చబడి, పడిపోయిందో లేదోనని నేను అప్పుడప్పుడూ తడుముకొని గర్వంగా చూసుకున్న పేపర్ జెండా, ఒళ్ళు ఉప్పోంగేలా కళ్ళ వెంట ఉద్వేగంతో ఉబికే కన్నీళ్ళతో పాడిన వందేమాతరం ఒక ఎత్తు అయితే. అప్పటికి మాకున్న జ్ఞానానికి మేము డిబేట్ లలో, వ్యాస రచనలో పాల్గొనడం మరొక ఎత్తు. ఏడవ తరగతిలో అనుకుంటా బాగా గుర్తు మా ప్రిన్సిపాల్ చేతుల్లో తీసుకున్న బహుమతి. నా ఉద్దేశం ఇక్కడ నేను బహుమతి తీసుకున్నానని చెప్పడం కాదు, ఆ పోటీ ఉంది కాబట్టే అప్పటికి నేను గణతంత్ర దినోత్సవం గురించి తెలుసుకున్నాను. అలాంటి పోటీలు పిల్లలకి పెడితే వాళ్ళు మన చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం ఉంది. ప్రైవేటు స్కూళ్ళు ఇప్పటికైనా తమ బాధ్యత గుర్తించి గణతంత్ర దినోత్సవం,స్వాతంత్ర దినోత్సవం లాంటి పండుగలను విధిగా నిర్వహించాలి. ప్రభుత్వం కళ్ళుతెరిచి జాతీయ పర్వదినాలను సెలబ్రేట్ చేసుకోని పాఠశాలల గుర్తింపు రద్దు చెయ్యాలి.
1947, ఆగస్టు 15 న మనదేశం స్వాతంత్ర్య దేశంగా అవతరించింది. కేవలం స్వతంత్రమే లభించింది, కానీ సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం మాత్రం కాదు. దేశాన్ని నడిపించడానికి నాయకులు ఉన్నారు తప్ప, సరైన విధివిధానాలు లేవు. బ్రిటిష్ వారి చట్టాలే అమల్లో ఉన్నాయి. మనల్ని మనం చక్కగా పాలించుకునే విధంగా, ప్రభుత్వ నిర్మాణం పరిపుష్టంగా ఉండేలా రాజ్యాంగం మనకూ ఉండాలి అని భావించారు ఆనాటి నేతలు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. 1947, ఆగస్టు 29న రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ కమిటీ ఛైర్మన్ గా ఉత్తమ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఎంతో మంది మేధావులు అనేక దేశాల రాజ్యాంగాల్ని ఆపోసన పట్టి వాటన్నింటినీ ఆధారంగా చేసుకుని కొన్ని దేశాల నుంచి మంచి సూత్రాలని దత్తత తీసుకుని మన రాజ్యాంగ రూపాకల్పనా గావించారు. దీనికి రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. 1949, నవంబర్ 26 రాజ్యాంగపరిషత్ అంబేద్కర్ సారథ్యంలో పూర్తయిన రాజ్యాంగానికి ఆమోద ముద్ర వేసింది. అతి పెద్ద లిఖిత రాజ్యంగముగా మనది చరిత్రకెక్కింది. దీనిని 1950, జనవరి 26న అమల్లోకి తెచ్చారు. ఆనాటి నుంచి మనదేశం స్వతంత్రదేశమే కాదు, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది.