ఏపీ మాజీ స్పీకర్ కోడెల
కుటుంబానికి వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే కోడెల సహా
ఆయన కుమారుడు కుమార్తెల మీద కేసులు నమోదు కాగా ఈరోజు ఏకంగా వారి ఆస్తులను
సీజ్ చేసి మరీ షాకిచ్చారు అధికారులు. ఆయన కుమారుడు శివరామ్ ఆధ్వర్యంలో
నడుస్తున్న గౌతమ్ హోండా షోరూమ్‌ను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. పన్నులు
చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు విక్రయించినట్లు
గుర్తించినందునే షో రూమ్ ని సీజ్ చేసినట్టు చెబుతున్నారు. ఐదేళ్లగా పన్ను
చెల్లించకుండానే వాహనాలను విక్రయిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలిందనీ
అందుకే షో రూమ్ ని సీజ్ చేశామని అధికారులు చెబుతున్నారు. హోల్ సేల్ డీలర్
వద్ద టూ వీలర్ వాహనాలు కొనుగోలు చేసి ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేకుండా
వాహనాలు అమ్మినట్టు నిర్థారించారు. టూ వీలర్ల ట్యాక్స్‌ను ఆర్టీఏకు
చెల్లించకుండా ఎగవేసినట్టు షోరూమ్‌లో తనిఖీలు నిర్వహించి రికార్డుల్ని
పరిశీలించడంతో ఈ వ్యవహారం బయటపడినట్టు చెబుతున్నారు. ఇక ఈ షో రూమ్ తో
పాటుగా శివ రామ్ కి బినామీ గా చెప్పబడే యర్రంశెట్టి మోటార్స్‌ను కూడా
అధికారులు సీజ్ చేశారు. గౌతమ్ షో రూమ్ లో లానే ఇక్కడ కూడా ట్యాక్సులు
చెల్లించకుండా వాహనాలు విక్రయించినట్లు ఆర్టీఏ అధికారులు నిర్ధారించారు.
యర్రంశెట్టి షోరూమ్ కూడా కోడెల కుటుంబానికి సన్నిహితంగా ఉండే
వ్యక్తులదేనని తెలుస్తోంది. అసలే కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కోడెలు
కుటుంబానికి ఇంకెన్ని ఇబ్బందులు చుట్టుముడతాయో వేచి చూడాలి.