నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ మీద దాడి చేశారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం మీద ఎమ్మెల్యే ఆయన అనుచరుల మీదా పోలీసులు కేసు నమోదు కూడా చేశారు. ఈ విషయం మీద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనదైన శైలిలో స్పందించారు. ఈ మధ్య ట్విట్టర్ లో బాగా యాక్టివ్ గా ఉంటున్న ఆయన ఈ విషయం మీద కూడా ట్వీట్ చేసారు. మద్యం మానవసంబంధాలని మంటగలుపుతుందని జగన్ గారు అన్నమాటను వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి నిజం చేశారు. మందుకొట్టి ఒక విలేఖరి ఇంటికి వెళ్ళి అతనిపై చేయిచేసుకుని 'చంపుతా' అని అమానుషంగా బెదిరించడమే కాకుండా, 'జగన్ కూడా నన్నేమీ చేయలేడు' అంటూ వైసీపీ అధినేత పరువును కూడా తీసేశారు. ఇదే శాసనసభ్యుడు అసెంబ్లీలో చంద్రబాబు గారిని 'ఖబడ్దార్' అన్నప్పుడు జగన్ ముసిముసిగా నవ్వుకున్నారని, ఇప్పుడా నవ్వు ముఖాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలియక అవస్థలు పడుతుంటే చూడడం తమకూ బాధగానే ఉందని లోకేశ్ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. కానీ ఏమి చేస్తాం వైసీపీ సంస్కృతే అలాంటిదని లోకేశ్ విమర్శించారు.