కోల్‌కతాలోని ఓ బిల్డింగ్ నుంచి కరెన్సీ కట్టల వర్షం కురిసింది. బెంటిక్
స్ట్రీట్‌లోని ఓ కంపెనీలో డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో
ఆరవ అంతస్తు నుంచి కొందరు నోట్ల కట్టలను బయటకు విసిరేశారు. 2వేలు, 5 వందలు,
వంద నోట్ల కట్టలను పైనుండి విసిరేశారు. హోక్యూ మర్కన్టైల్ ప్రైవేటు
లిమిటెడ్ సంస్థ ఆఫీసు వద్ద ఈ ఘటన జరిగింది. హోక్యూ కంపెనీలో డైరెక్టరేట్
ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. వారి నుంచి
తప్పించుకునేందుకు కొందరు అక్రమార్కులు...చీపురకర్రలతో కిటికీలోంచి
నోట్ల కట్టలను విసిరేసినట్లు తెలుస్తోంది. కిందపడిన కరెన్సీని కొందరు
సేకరిస్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు
నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.